బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 6 మే 2015 (17:19 IST)

నేను అవర్లీ రిలేషన్‌షిప్ కోరుకుంటా... : రామ్‌గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూ

స్త్రీపురుషులను పెండ్లి పేరుతో పెద్దలు ఒకటి చేస్తారు. తర్వాత వారిలో కొంతమంది ఏదో కారణంతో విడిపోతారు. ఇంకోవైపు మరికొందరు ప్రేమించుకని పెండ్లి చేసుకుంటారు. ఆ ప్రేమలో మునిగిపోతారు. ఎక్కడో చిన్నపాటి స్పర్థలు మొదలయి విడిపోతారు. ఇదంతా అప్పుడు ఇప్పుడూ జరుగుతుంది. అందుకే చాలామంది యువత ఆలోచనలు మారిపోయాయి. సహజీవం వచ్చేసింది. ఫ్యూచర్‌లో పెండ్లి అనేది వుండకపోవచ్చని సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఆయన తాజాగా తీసిన సినిమా '365 డేస్‌'. ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ...
 
మర్డర్లు, హత్యలు, దెయ్యాలు వదిలిపెట్టి పెండ్లి బంధం అనే కాన్సెప్ట్‌ తీయడానికి కారణం? 
అవన్నీ రొటీన్‌గా అనిపించాయి. అందుకే పెండ్లి కాన్సెప్ట్‌ చేశాను. పెళ్ళైన కొన్నాళ్ళకు మన ఇష్టాలకు, అవతలి వ్యక్తి ఇష్టాలకు మధ్య తేడాలొస్తాయ్‌. దాంతో ఇద్దరి మధ్య చిన్న గ్యాప్‌ ఏర్పడుతుంది. ఆ గ్యాప్‌ పెరిగేకొద్దీ ఆ బంధం బ్రేకప్‌కి దగ్గరైపోతుంది. విడిపోవడానికి గల కారణాలు సిల్లీగా కనిపించినా.. అదే నిజం. '365 డేస్‌' సినిమాలో కూడా అదే చూపించా.  
 
దీనికి స్పూర్తి ఏమైనా వుందా?
నా జీవితం, నా చుట్టూ ఉన్న జీవితాలు, సమాజం నుంచి పుట్టిన కథే ఈ సినిమా. నేటి ట్రెండ్‌ పెండ్లిపై ఇలా వున్నారని చెప్పాను. ఇది నా జడ్జిమెంట్‌ అని చెప్పను. ప్రేక్షకులకే వదిలేస్తాను.
 
టైటిల్‌కు అర్థమేమిటి?
ఏదైనా మనిషైనా, వ్యాపారమైనా ఏడాది పాటు చూడాలంటారు. వాళ్ళ ఆలోచనలు తెల్సుకోవడం లాంటివి జరగడానికి దాదాపుగా ఓ సంవత్సరం పడుతుంది. ఈ సమయంలోనే మనకు మొదట్లో ఉండే ఎగ్జైట్‌మెంట్‌ రానురానూ తగ్గిపోతూ ఉంటుంది. ఓ సంవత్సరం దాటిన తర్వాత ఆ ఎగ్జైట్‌మెంట్‌ పూర్తిగా పోయి రియాలిటీలోకి వచ్చి పడతాం. అందుకే ఆ టైటిల్‌ పెట్టాను.

 
మీ భార్యను వదిలేశారన్నారు. ఈ చిత్రంలో మీ స్టోరీ కూడా కనిపిస్తుందా?
దాదాపు యాభై శాతం వరకూ ఈ సినిమా నా పర్సనల్‌ ఎక్స్‌పీరియన్సే! మిగతా పోర్షన్‌ కూడా నాకు తెల్సిన వ్యక్తుల జీవితాల నుంచి తీసుకున్నదే! ఈ పెళ్ళి, విడిపోవడం ఇదంతా వాళ్ళవాళ్ళ జీవితాల్లో ఒక్కో రకంగా జరిగినా ఓవరాల్‌గా అందరిదీ ఒకే రకమైన ఎమోషన్‌. అందుకే ఈ సినిమాకు ఎవ్వరైనా కనెక్ట్‌ కాగలరు.
 
ప్యూచర్‌లో పెండ్లి కాన్సెప్ట్‌ వుండదంటారా?
ఇప్పటి సమాజం పర్సనల్‌కు ఎక్కువ ప్రిఫర్‌ చేస్తుంది. అదెలా వుందంటే... భార్యను కూడా పర్సనల్‌ లైఫ్‌ ఆలోచనలకు రానివ్వకపోవడం. ఆమెకు చెప్పకపోవడం. ఇది విదేశీ కల్చర్‌ కావచ్చు. వారి ఆలోచనలు మారవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరు మారడమో, అడ్జస్ట్‌ అవ్వడమో జరగని పని. అందుకే కొన్నాళ్ళ తర్వాత అసలు పెళ్ళనేదే ఉండదు. ఇప్పుడిప్పుడే సహజీవనం అనే కాన్సెప్ట్‌ బాగా పెరిగింది. త్వరలోనే వీకెండ్‌ రిలేషన్‌‌షిప్స్‌ లాంటివి ఇక్కడ కూడా వచ్చేస్తాయి. నన్నడిగితే నేను అవర్లీ రిలేషన్‌‌షిప్‌ కోరుకుంటా. 
 
సెన్సార్‌ వారు యు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి కారణం?
ముందు పెద్దగా ఆశ్చర్యపడలేదు. యు ఇచ్చారంటే అందరూ చూసే చిత్రమనిపించింది. ఒక రకంగా నాకే కొత్తగా వుంది.  
 
మీ భార్యనుంచి విడిపోయి చాలా కాలమయింది. అప్పటికి, ఇప్పటికీ మీలో ఏదైనా మార్పు ఉందా?
అప్పట్లో నేను నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో మాత్రమే ఆలోచించాను. ఇప్పుడు నా భార్య, ఆ సమయంలో ఏం ఆలోచించి ఉంటుందనేది కూడా ఆలోచించగలుగుతున్నా. ఆ సమయంలో నేనెంత కరెక్టో, తనూ అంతే కరెక్ట్‌. కాకపోతే అప్పట్లో మనకు అవతలి వ్యక్తి కరెక్టన్న ఆలోచన కూడా వచ్చి ఉండదు.
 
మీలో మార్పు వస్తుందని కొందరంటున్నారు
మార్పు సహజం. నా ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా వుండవు.  
 
తెలుగులో అగ్ర హీరోలతో చేయరేం?
పెద్దాచిన్నా అని చూడను. కథను  బట్టే తీస్తాను. నెక్ట్స్‌ కిల్లింగ్‌ వీరప్పన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తీస్తున్నా. ఆ సినిమాకున్న స్కేల్‌కి, కథ నేపథ్యానికి ఖచ్చితంగా ఎక్కువ ఖర్చవుతుంది. అంతేతప్ప కావాలని బడ్జెట్‌ పెంచితే ఏం ప్రయోజనం? సినిమా విజయం సాధిస్తే.. చిన్న సినిమాయే పెద్ద సినిమా అవుతుంది.
 
అమితాబ్‌తో మళ్ళీ సినిమా వార్తలు వస్తున్నాయి?
ఇప్పుడే ఏం చెప్పలేను. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాను అని ముగించారు.