గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 అక్టోబరు 2014 (18:20 IST)

పవన్ ను డీల్ చేయడం కష్టం... సమయం దొరికితే చూస్తా... రేణూ దేశాయ్‌

రేణు దేశాయ్‌ అంటే... పవన్‌ కళ్యాణ్‌ భార్యగానే తెలుసు. ఆ పేరును ఆమె చక్కగా ఉపయోగించుకుంది. కొన్నాళ్ళు కాపురం చేశాక.. వారి కాపురానికి సాక్షిగా అకిరా నందన్‌ జన్మించాక కొన్ని కారణాల వల్ల పవన్ కు దూరమైంది. ఐతే ఆమె మనస్సు... ఎప్పటి నుంచో ఉన్న కోరికపైకి మళ్లింది. అదే దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలని. తన మాతృభాష మరాఠిలో 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే సినిమాతో ముందుకు వచ్చింది. ఇటీవలే హైదరాబాద్‌ వచ్చిన ఆమె చెప్పిన సంగతులు.
 
ఇష్క్‌ వాలా లవ్‌లో.. కథాంశం ఏమిటి? 
ఒకప్పుడు పెండ్లి అంటే.. పెద్దలు కుదిర్చిందే చేసుకోనేవారు. కానీ రానురాను ప్రేమ పెండ్లిళ్లు ఎక్కువయ్యాయి. కానీ ప్రస్తుతం మరింతగా ముందుకు వెళ్ళి.. అసలు పెండ్లి చేసుకోవాలా? వద్దా? అనేంతగా వెళ్ళిపోయింది. ఇందుకు కారణమేమిటి? యువతరం నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? అనేవి ఇందులో చర్చించాం.
 
అంటే మీ వ్యక్తిగతానికి దీనికి సంబంధాలున్నాయా? 
లేనేలేదు. నా వ్యక్తిగతం అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రంలోని కథ ఎన్నో ఏళ్ళ క్రితమే రాసుకున్నా.
 
ఎలా చెప్పినా... మీరు పెండ్లి చేసుకోలేదు కదా? 
సినిమా చూశాక.. మా వ్యక్తిగతం వుందా? లేదా? అనేది మీకే తెలుస్తుంది.
 
పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాను చూశారా? 
నేను ఇంతకుముందు 'మంగలాష్టక్‌ వన్స్‌మోర్‌' అనే చిత్రాన్ని తీశాను. దాన్ని చూశారు. సర్‌..కి బాగా నచ్చింది. 'ఇష్క్‌..' చిత్రాన్ని చూశాను. బాగా తీశావ్‌ అన్నారు. 
 
దర్శకత్వం చేయాలనే ఆలోచన ఎప్పటిది? 
నేను 99లో బద్రి సినిమా కోసం హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడికి వచ్చాక మూడేళ్ళకు సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. అప్పటి నుంచి సార్‌... నాకు స్పూర్తిగా నిలిచారు. 
 
ఇందులో మీ అబ్బాయి నటించడానికి కారణం? 
ఓ పాత్రకు అలాంటి వయస్సున్నవాడు కావాలి. అందుకోసం చాలామందిని ఎంపిక చేశాం. కానీ ఎవ్వరూ నచ్చలేదు. ఆ సమయంలో అకీరాతోనే చేస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు పవన్‌తో చెబితే.. ఒక్కసారిగా నవ్వేశారు. అకీరా బాగానే చేశాడని తర్వాత మెచ్చుకున్నారు.
 
ఇంకా మీరు నటించరా? 
మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తా.
 
పవన్‌ను డైరెక్ట్‌ చేయవచ్చుకదా? 
అంత పెద్ద నటుడ్ని నేను డీల్‌ చేయడం కష్టం. కథ దొరికితే సమయం లభిస్తే... తప్పకుండా ఆలోచిస్తాను.