గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: శనివారం, 26 జులై 2014 (21:31 IST)

ఈ ఏడాది ఆల్‌రౌండర్‌నయ్యా- డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌

తన కంచుకంఠంతో తెలుగు సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శర్మగారి నటవారసుడిగా వచ్చిన సాయికుమార్‌... నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అయితే ఎన్ని పాత్రలు చేసినా ఆయన నటించిన పోలీస్‌స్టోరీ.. చెరగని ముద్రవేసింది. అదే కెరీర్‌ను ఎంతో మలుపు తిప్పిందని చెబుతున్నారు సాయికుమార్. ఆ తర్వాత పోలీస్‌స్టోరీ-2 పార్ట్‌ తీసినా.. అందులో నాలోని ఆవేశం తగ్గిందనీ.. కర్నాటక స్టేట్‌లో చాలా ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చాయి. ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా చేశానన్నా ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు పార్ట్‌-3గా న్యూ పోలీస్‌స్టోరీ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు. సాయికుమార్‌ పుట్టినరోజు ఈ నెల 27. అంటే ఆదివారం. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారు? 
నేను ఉదయమే ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడుపుతాను. సాయంత్రం వైజాగ్‌ వెళ్ళాలి. మా ఆది నటించిన 'గాలిపటం' ఆడియో విజయోత్సవ వేడుక అక్కడ జరుపుతున్నారు నిర్మాత. అక్కడే కేక్ కూడా కట్‌ చేయవచ్చు.
 
సినీ ప్రస్తానం ఎలా అనిపిస్తుంది? 
1996 నుండి 2002 వరకు హీరోగానే వరుస సినిమాలు చేశాను. కానీ 'సామాన్యుడు' సినిమా నుండి నా పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని మంచి పాత్రలను సెలక్ట్‌ చేసుకున్నాను. 'సామాన్యుడు', 'ప్రస్థానం', 'ఎవడు' సినిమాల్లో డిఫరెంట్‌ గెటప్స్‌లో నటించాను. ప్రతి రోల్‌ను హీరోగానే ఫీలై చేశాను. 'ఎవడు' సినిమా చూడగానే చాలామంది ఈ సంవత్సరం మీదేనని అన్నారు. 'ఎవడు' సినిమాతో పోల్చితే 'ఆటోనగర్‌ సూర్య'లో పూర్తిగా డిఫరెంట్‌ రోల్‌. 
 
విమర్శకుల ప్రశంసల సైతం కూడా అందుకున్నాను. ఇటీవల కన్నడలో 'రోజ్‌' అనే చిత్రంలో పవర్‌ఫుల్‌ జైలర్‌ క్యారెక్టర్‌ చేశాను. కన్నడలో నన్ను నెగటివ్‌ రోల్స్‌లో చూడటానికి ఆడియెన్స్‌ ఇష్టపడడం లేదు. పాజిటివ్‌ వైబ్రేషన్‌ ఉన్న రోల్‌ లేకుంటే హీరో రోల్స్‌ చేస్తేనే ఇష్టపడుతున్నారు. కన్నడలో 'అంగుళీమాల' సినిమాలో టైటిల్‌ రోల్‌ చేశాను. అలాగే 'నేనేనా భగవంత' నేను, సాక్షిశివానంద్‌ కలిసి నటించాం. సోషియో ఫాంటసీ మూవీ. 'కలిగాళ' అనే సినిమాని 'జన్మస్థానం' అనే పేరుతో తెలుగులో కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 
 
ఈసినిమాలో సాయిప్రకాష్‌ దర్శకత్వంలో పోలీస్‌ రోల్‌ చేశాను. అలాగే యక్షగాన ఆధారంగా చేసుకుని ఓ మేజర్‌ రోల్‌ను చేస్తున్నాను. సినిమాకి ఇంకా టైటిల్‌ పెట్టలేదు. 'మొదమొదలు మాతు చంద' అనే సినిమాలో గుడ్డివాడి గెటప్‌ వేస్తున్నాను. అలాగే కన్నడలో 'నాగనిక' అనే సినిమా చేస్తున్నాను. అంతేకాకుండా మలయాళంలో 'సౌకత్‌ అలీఖాన్‌ ఐపియస్‌' సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో ఆల్‌రౌండర్‌లా అన్ని దక్షిణాది బాషల్లో సినిమా చేసిన నటుడి లిస్ట్‌లోకి చేరిపోయాను. చాలా హ్యపీగా ఉంది. 
 
1975లో 'దేవుడిచేసిన మనుషులు' సినిమాలో బ్లైండ్‌ రోల్‌ చేసిన తర్వాత ఈ సినిమాలోనే అటువంటి డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నాను. ఈ సినిమాకి నా ఫ్రెండ్‌ నిర్మాతగా పనిచేస్తున్నారు. తన తనయుడిని ఈ సినిమాతో ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. 'యాక్షన్‌' అనే యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేస్తున్నాను. సినిమా చాలా బాగా వస్తుంది. నాకున్న పోలీస్‌ ఇమేజ్‌కి మళ్లీ ఎలివేషన్‌ వస్తుంది. గోపిచంద్‌ మలినేని సినిమా 'పండగచేస్కో' లో నటిస్తున్నాను. ఇందులో నాది, జగపతిబాబుది పార్‌లల్‌ రోల్స్‌. ఆద్యంతం పోటీగా సాగే క్యారెక్టర్‌ చేస్తున్నాను. 'ఎవరికి ఎవరు' అనే సినిమా కూడా చేస్తున్నాను. ఇందులో శివభక్తుడిగా నటిస్తున్నాను.
 
పోలీస్‌ స్టోరీ- 3 ఎప్పుడు వుంటుంది? 
ఈ  సంవత్సరం 'పోలీస్‌ స్టోరీ -3' చేయాలనుకున్నాను. కొత్త గెటప్‌ వేస్తున్నాను. ఇది సీక్వెల్‌ మూవీ కాదు. న్యూ పోలీస్‌ స్టోరీ. కాకుంటే ఆ ఫీల్‌తో ఉన్న కొత్త కథ. సేమ్‌ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను. సెకండాఫ్‌ అంతా డిఫరెంట్‌ గెటప్‌తో కనిపిస్తాను. ఈ సినిమాని కసితో చేద్దామని, యాక్షన్‌సైడ్‌ కూడా రిస్క్‌ చేసి చేయాలనుకున్నాను.
 
కుటుంబమంతా కలిసి నటించే ఆలోచన వుందా? 
తప్పకుండా చేయాలని అనుకున్నాం. దీనికి 'మనం' ఇన్సిపిరేషన్‌ తోడయింది. నాన్నగారు, నేను, ఆదితోపాటు మా ఇద్దరు సోదరులు అయ్యప్ప, రవి కూడా కలిసి చేస్తే బాగుంటుందనుకుంటుంటాం. మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాను. గతంలో కన్నడలో ఓ స్టోరి కుదిరింది కానీ చివరికి ఎందుకనో నచ్చలేదు. రోటీన్‌ ఫార్ములాలా ఉంది. యాక్షన్‌ బ్యాగ్రౌండ్‌తో ఫ్యామిలీ డ్రామా చేయాలనుంది. ఉదాహరణకి 'పందెంకోడి' లాంటి సినిమాలో రాజ్‌కిరణ్‌, విశాల్‌ ఇద్దరి క్యారెక్టర్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాంటి సినిమా చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలో నాన్నగారు కూడా నటిస్తారు. అన్ని కుదిరితే వచ్చే డిసెంబర్‌ 23 ఆది బర్త్‌డేకి ఈ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం. 
 
డ్రీమ్‌రోల్‌ ఏమైనా వుందా? 
ఆర్టిస్ట్‌గా డ్రీమ్‌ రోల్స్ చాలానే ఉన్నాయి. పౌరాణిక పాత్రలైన ధుర్యోధనుడు, కర్ణుడు రోల్స్‌ చేయాలనుకుంటున్నాను. ఈ టీవీతో మంతనాలు జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే టీవీలోనైనా అటువంటి పాత్రల్లో కనిపిస్తాను. బాలకృష్ణగారు 'నర్తనశాల' అనౌన్స్‌ చేసినప్పుడు నేనే ధుర్యోధనుడిగా చేయాల్సింది. మళ్లీ సినిమా ఉంటుందని ఆయన అంటున్నారు. చూడాలి. 
 
ఆది కెరీర్‌ ఎలా వుంది? మీ సలహాలు తీసుకుంటున్నాడా? 
ఆది కెరీర్‌ కూడా చక్కగా సాగిపోతుంది. 'ప్రేమకావాలి', 'లవ్‌లీ' సినిమాలతో తనకి మంచి బ్రేక్‌ వచ్చింది. 'ప్యార్‌మే పడిపోయానే', 'సుకుమారుడు' సినిమాలతో ఆర్టిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు 'గాలిపటం' విడుదలకు సిద్ధంగా ఉంది. 'రఫ్‌' సినిమా కూడా రెడీ అవుతోంది. గాలిపటం ఫుల్‌ లెంగ్త్‌ లవ్‌స్టోరీ అయితే, రఫ్‌లో తన క్యారెక్టర్‌ రఫ్‌ విత్‌ లవ్‌ సబ్జెక్ట్‌. ఇవి కాకుండా మదన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. నా వరకు తనకి నేను చిన్న చిన్న సలహాలు ఇస్తున్నానంతే. కథ కూడా తనకి నచ్చిన తర్వాతే నేను వింటున్నాను. ఏవైనా ఛేంజస్‌ అవసరం అనుకుంటే చెబుతున్నాను. ఆదిని కూడా కన్నడలో ఇంట్రడ్యూస్‌ చేయమని చాలామంది అన్నారు. అయితే నేను తనని ఇక్కడే కాన్‌సన్‌ట్రేషన్‌ చేయమన్నాను. 
 
ఆది పెళ్లి కొడుకును చేస్తున్నారా? 
ఆదికి కూడా వచ్చే సంవత్సం పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. 
 
ఆరోగ్య రహస్యం? 
చిన్నప్పట్నుంచి  సిస్టమేటిక్‌ లైఫ్‌ అలవాటైంది. అందువల్లనే హెల్దీగా ఉంటున్నాను. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. నాన్‌వెజ్‌ కూడా తీసుకోవడం లేదు. 
 
కెరీర్‌లో తప్పటడుగు వేశానని ఎప్పుడైనా అనిపించిందా? 
జీవితంతోపాటు వృత్తిపరంగా కొన్ని తప్పులు తెలిసో తెలియకుండానో జరుగుతుంటాయి. నాకూ జరిగాయి. నేను కన్నడలో పీక్‌ లెవల్‌లో ఉన్నప్పుడు కాన్‌సన్‌ట్రేషన్‌ చేయకుండా రెండు పడవల ప్రయాణం చేశాను. అందుకే అనుకున్న విధంగా సక్సెస్‌ కాలేకపోయాను. స్వంత సినిమా చేయడం, అది అనుకున్నంత సక్సెస్‌ కాకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డాం. అందువల్ల ఇక్కడే ఎక్కువగా సినిమాలు చేశాను. కన్నడలో మంచి సినిమా అవకాశాలను వదులుకున్నాను. అవుటండ్‌ అవుట్‌ మాస్‌ సినిమాలు చేయడం వల్ల సినిమాలు వన్‌ సైడెడ్‌లా తయారయ్యాయి. నా డబ్బింగ్‌ సినిమాలు ఎక్కువగా వచ్చి నా మార్కెట్‌ను దెబ్బతీశాయి. ఉదాహరణకి 'కాంచన' సినిమాని 'కల్పన' పేరుతో ఇక్కడ మళ్లీ డబ్‌ చేసి విడుదల చేశారు. ఇలా చాలా కారణాలు ఉన్నాయంటూ.. ముగించారు.