గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: గురువారం, 22 జనవరి 2015 (19:40 IST)

రెజీనా, రకుల్, రాశి... అంతా మొదటిసారి నాతోనే... హ్యాపీగా ఉంది... సందీప్‌ కిషన్‌

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమా తర్వాత యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన మరో సినిమా 'బీరువా'. మనం ఎలాంటి సినిమాలు చేయాలి అని ఆలోచించడం కంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాలు కోరుకుంటున్నారో తెలుసుకుని అటువంటి సినిమాలు చేయడం బెస్ట్‌. అటువంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'బీరువా'. రెండు ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలు ఉషా కిరణ్‌ ఫిలింస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా కణ్మణి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ సినిమా ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌తో ఇంటర్వ్యూ...
 
'బీరువా' టైటిల్‌ వింటుంటూనే డిఫరెంట్‌గా ఉంది..అసలు కథేంటి? 
ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటున్నారు. అలా రెండు అంశాలు మిక్స్‌ అయి ఉన్న సినిమాయే బీరువా. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రం తర్వాత నేను ఒప్పుకున్న సినిమా ఇది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాలో బీరువాను బేస్‌ చేసుకునే స్టోరి రన్‌ అవుతుంది. చిన్నప్పట్నుంచి మనకు ఏదో ఒక వస్తువు అంటే ఇష్టం ఉంటుంది. 
 
అలాగే ఈ సినిమాలో హీరో సంజుకి బీరువా బెస్ట్‌ ఫ్రెండ్‌. చిన్నతనంలో తప్పు చేసిన ప్రతిసారి తండ్రి నుండి తప్పించుకోవడానికి బీరువాలో దాక్కుంటాడు. అక్కడున్న రంధ్రం నుండి తనకి అప్పటివరకు ఉన్న ప్రపంచం కాకుండా డిఫరెంట్‌గా కనపడుతుంది. తన తండ్రికి తనపై ఉన్న ప్రేమ కనపడుతుంది. అప్పటినుండి బీరువా హీరోకి ఫ్రెండ్‌గా మారిపోతుంది. చివరకి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం 'బీరువా'ను ఎలా సంజు ఎలా ఉపయోగించుకున్నాడు అనేది సినిమా కథ. 
 
దర్శకుడు స్క్రిప్ట్‌ వినగానే మీకేమనిపించింది? 
ప్రతి సినిమాని వినగానే నేనొక విజువలైజేషన్‌ చేసుకుంటాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ముందు పాయింట్‌ వినగానే కొంత డౌట్‌ వచ్చింది. డిఫరెంట్‌ పాయింట్‌ అసలు మా ఇద్దరి అభిప్రాయాలూ కలుస్తాయా? అని అనుకున్నాను. చివరకి జెమిని కిరణ్‌గారు కథ వినమంటే విన్నాను. నాకు బాగా నచ్చింది. మరో ఆలోచన లేకుండా సినిమాను అంగీకరించాను. ఒక వినూత్నమైన కథను కమర్షియల్‌ బాణీలో చెప్పడానికి ప్రయత్నించాం. నా కెరీర్లో ఇదొక మంచి సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. అలాగే ఈ సినిమాకి మాకున్న ఎక్స్‌ట్రా బలం మావయ్య ఛోటాగారు. ఎక్సలెంట్‌గా ప్రెజెంట్‌ చేశారు. చోటా మామ హార్డ్‌ వర్క్‌, టాలెంట్‌ సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌‌కు తీసుకు వెళ్ళింది. 
 
ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి? 
నిజమే.. ఈ సినిమా గుంటూరు డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను నేను నా స్నేహితుడు రాజేష్‌ కలిసి తీసుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాం. 

 
డైరెక్టర్‌ కణ్మణితో పనిచేయడం ఎలా అనిపించింది? 
కణ్మణి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. కొందరు కథను అద్భుతంగా నేరేట్‌ చేసినా, సినిమా తీయడంలో విఫలం అవుతారు. కన్మణి అలా కాదు, నాకు చెప్పిన కథ కంటే 10 రెట్లు బాగా తెరపై ఆవిష్కరించాడు. అతని వర్క్‌ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా తను మంచి నటుడు కూడా అందరి నుండి ఎలా యాక్టింగ్‌ అవసరమో దాన్ని రాబట్టుకున్నారు.
 
థమన్‌ మ్యూజిక్‌ గురించి..? 
థమన్‌తో పనిచేయడం చాలా హ్యపీగా ఉంది. ఇది ఒక కమర్షియల్‌ ట్రీటెడ్‌ సినిమా. ఇలాంటి సినిమాని ఫ్యామిలీ అంతా చూసేలా తెరకెక్కించాలంటే మంచి మ్యూజిక్‌ అవసరం. సినిమా అంతా ఎనర్జిటిక్‌గా సాగుతుంది. అందుకనే థమన్‌ మ్యూజిక్‌ అయితే బాగుంటుందనిపించింది. నాకు చిన్నదానా.. అనే సాంగ్‌ బాగా నచ్చింది. 
 
హీరోయిన్‌ సురభి ఎంత వరకు ప్లస్‌ అయింది? 
హీరోయిన్‌ సురభికి ఇది తొలి సినిమా. సినిమా అంటే తనకి చాలా రెస్పెక్ట్‌ ఉంది. తను ఈ సినిమా భూమిక టైప్‌ సాఫ్ట్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్‌ చేసింది. తనని చూడగానే డైరెక్టర్‌ సహా ఈ అమ్మాయి అయితే ఈ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తుందనిపించింది. అందరూ అనుకున్న విధంగానే తను బాగా నటించింది.
 
నరేష్‌ వంటి సీనియర్‌ నటుడు మీరు మంచి కామెడి టైమింగ్‌ ఉన్న హీరో అని కాంప్లిమెంట్‌ ఇస్తున్నారు. మీరెలా ఫీలవుతున్నారు? 
నరేష్‌ లాంటి సీనియర్‌ హీరో అలా కాంప్లిమెంట్‌ ఇవ్వడం చాలా హ్యపీగా అనిపించింది. అందుకు ఆయనకి స్పెషల్‌ థాంక్స్‌. నేను నరేష్‌గారి సినిమాలు బాగా చూసేవాణ్ణి. ఆయనతో నటించేటప్పుడు ఆయన కామెడి టైమింగ్‌ను అందుకుంటే చాలు అనిపించి నటించాను. ఫైనల్‌గా మంచి కామెడి వచ్చింది.
 
సందీప్‌ గోల్డెన్‌ హ్యాండ్‌ అని మీతో నటించిన ప్రతి హీరోయిన్‌ టాప్‌ రేంజ్‌కి వెళుతుంది కదా, మీకెలా అనిపిస్తుంది? 
చాలా సంతోషంగా ఉంది. నేను నటించిన హీరోయిన్స్‌ అందరూ నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. రెజినా, రకుల్‌ ప్రీత్‌, రాశి ఖన్నా అందరూ నాతో మొదటి సినిమాకి పనిచేసినవాళ్లే. ఇప్పుడు అందరూ టాప్‌ రేంజ్‌ హీరోయిన్స్‌ అయ్యారు. మన ఫ్రెండ్స్‌ అలా మంచి పొజిషన్లో ఉండటం కంటే ఆనందం ఏముంటుంది. 
 
రెండు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు నిర్మించిన 'బీరువా' చిత్రంలో హీరోగా నటించడం పట్ల మీ రెస్పాన్స్‌? 
కథపై నమ్మకంతో రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాయి. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనేది మా లక్ష్యంతో 'బీరువా' చిత్రాన్ని రూపొందించాయి. గతంలో ఉషాకిరణ్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఎన్నో సక్సెస్‌ఫుల్‌ త్రాలను మనకు అందించారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌లో నేను చేస్తున్న రెండో సినిమా దాన్ని నా హోం బ్యానర్‌గానే ఫీలవుతాను. తొలిసారి అటువంటి గొప్ప సంస్థలు కలిసి చేస్తున్న సినిమా అనగానే చాలా హ్యపీ. 
 
ఒక హీరోగా బీరువాతో ఎలాంటి సక్సెస్‌ వస్తుందని భావిస్తున్నారు? 
నా కెరీర్‌కి 'బీరువా' మరో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ అవుతుందని భావిస్తున్నాను. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ హీరోగా నా కాన్ఫిడెంట్‌ను పెంచిన సినిమా, తిరిగి 'బీరువా' అలాంటి కాన్పిడెంట్‌ను ఇస్తుందని భావిస్తున్నాను. 
 
నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌? 
ఇప్పుడు టైగర్‌ సినిమా చేస్తున్నాను. అందరూ అనుకుంటున్నట్లు ఇది మాస్‌ సబ్జెక్ట్‌ ఉన్న సినిమా కాదు. ఇదొక సెటైరికల్‌గా సాగే సినిమా. ఒక వ్యక్తి వెటకారంగా తన పేరుని టైగర్‌ అని పెట్టుకున్నాడంటే అదేంటి అనేది చూడాలి. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. ఇప్పటివరకు ఎప్పుడూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌. అలాగే ఇప్పుడు తమిళ్‌ సినిమా చేయబోతున్నాను. అందులో కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్‌ రోల్‌ చేస్తున్నాను.