శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (14:31 IST)

నా జనరేషన్‌లో నేను ఆఖరి వారసుడిని: వరుణ్‌తేజ్‌

ఇటీవలే సినిమారంగంలో హీరోలుగా చిరంజీవి కుటుంబాల వారే ఎక్కువగా వస్తున్నారు. ఈ విమర్శలు అన్నిచోట్ల ఉన్నాయి. వాళ్ళకూ ఈ విషయం తెలుసు. అందుకే నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ ఇలా అంటున్నాడు. విమర్శలు అన్ని చోట్ల వుంటాయి. అవన్నీ పట్టుకుని కూర్చుంటే ముందుకు వెళ్ళలేనని చెబుతున్నాడు. ఆయన కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'ముకుంద'. పూజా హెగ్డే నాయిక. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. నల్లమలపు బుజ్జి, 'ఠాగూర్' మధు నిర్మాతలు. ఈనెల 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..
 
అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకనుకున్నారు?
బి.కామ్‌. చదివాను. ఎం.బి.ఏ. చేయాలనుకుంటుండగా.. సినిమాలోకి రావాలనే కోరిక ఒక్కసారిగా మా ఇంట్లోవారికి తెలిసింది. లేదంటే. అమెరికా వెళ్ళి చదువుకునేవాడిని.. సినిమా ఫ్యామిలీ కాబట్టి... అది రక్తంలోనేవుందేమో... 'మగధీర' టైమ్‌లో.. నేను లొకేషన్‌కు వెళ్ళిచూసేవాడిని... పెదనాన్నతో నా ఇంట్రెస్ట్‌ చెప్పాను. ఆయన చాలా కష్టపడాలి. అన్నారు.
 
మీరి మీ బాబాయ్‌ (పవన్‌)తో చెప్పలేదా?
నాకు బాబాయ్‌కు అంత ర్యాపోలేదు. ఎక్కువగా పెదనాన్నతో చనువుగా వుంటాను. అందుకే ఆయనతో ఈజీగా చెప్పగలిగాను. 'ముకుంద' కథ కూడా ఆయనే సెలెక్ట్‌ చేశారు. బాబాయ్‌కు తీరికలేక వినలేకపోయారు.
 
మెగాఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలువస్తున్నారనే విమర్శ వుంది. దీనిపై?
నిజమే. మా దృష్టికీ వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సినిమా చూడండి.. ప్రకటిస్తాం. కానీ థియేటర్‌ వరకు వారిని తీసుకురాలేమో.. నచ్చితే చూస్తారు.. ఇదీ అంతే. ఇటీవలే ఓ షాపింగ్‌మాల్‌లో సాయిధరమ్‌తేజ్‌తో 'మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వస్తార్రా' అని ఒకరు కామెంట్‌ చేశారట. సినిమాలపై ప్యాషన్‌తో ఎంతమందైనా రావొచ్చు. అలా అని మా సినిమాలే చూడమని చెప్పటంలేదు... అంటూ తను తిరిగి సమాధానం చెప్పాడట. అయినా విమర్శలు మామూలే.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరంలేదు.
 
నటుడిగా మీ బాబాయ్‌ సూచనలు ఏమైనా చేశారా? 
చేశారు. నేను హీరో అవుదామనుకుంటున్నానని అంటే.... నవ్వి... ఓకే... 'నీ మనసు ఏది చెబితే అదే చెయ్యి... ఒత్తిడులకు తలొగ్గొద్దు... పోటీ ఎక్కడైనా అనివార్యం.. కానీ నిలబడాలంటే కష్టపడాలి. కష్టపడే తత్వాన్నే మనసుకు అలవాటు చేసుకో... దారి దానంతటా అదే దొరుకుతుంది... ఇవే మాటలు బాబాయ్‌ (పవన్‌కళ్యాణ్‌) నాకు చెప్పారు.
 
'ముకుంద' ఏం చేస్తాడు?
ఇందులో నా పేరు ముకుందుడు. గామీణ నేపథ్యంలోసాగే చిత్రమిది. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగవేటలో వున్న ఓ కుర్రాడు లోకల్‌ రాజకీయాలతో పాలుపంచుకుంటో ఎలా వుంటుందనే కథాంశమిది. ప్రేమ, కామెడీ సన్నివేశాలు కూడా వుంటాయి.
 
సినిమారంగంలో ఏం కావాలనుకున్నారు?
నేను దర్శకుడు కావాలని అనుకున్నా. పలు సినిమాలు పరిశీలించాను. కానీ అది చాలా టఫ్‌ జాబ్‌. ఇప్పుడే చేయడం కరెక్ట్‌కాదని.. నటుడిగా మారాను.
 
అందుకు శిక్షణ విదేశాల్లో తీసుకున్నారా?
లేదు. ఇక్కడే తీసుకున్నా. నాలుగు నెలలపాటు వైజాగ్‌లోని సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా మూడు నెలల్లో బ్యాచ్‌ పూర్తవుతుంది. కానీ మా బ్యాచ్‌కు నాలుగు నెలలు పట్టింది. ఆ సమయం నాకు బాగా కలిసివచ్చింది.
 
మెగా ఫ్యామిలీ అంటే డాన్స్‌లు ఎక్స్‌పెట్‌ చేస్తారు కదా? నేర్చుకున్నారా?
మొదట్లో డాన్స్‌ నేర్చుకుంటే కాలు బెణికింది. నా హైట్‌కు ఇది సరిపదడని వదిలేశాను. ఈ సినిమాలో పెద్దగా డాన్సులు, ఫైట్‌లువుండదు. కానీ కమర్షియల్‌ చిత్రాలంటే నాకు ఇష్టం. పెదనాన్న మాత్రం ఏ విషయం ఎలా వున్నా డ్యాన్సులు మాత్రం నేర్చుకుని తీరాలని గట్టిగా చెప్పారు.
 
మొదట్లో పూరీ, క్రిష్‌ అనే పేర్లు విన్పించాయి?
అవును. శ్రీకాంత్‌ మొదటగా నాతో సినిమా చేయాలని సంప్రదించారు. కొంత ప్రాసెస్‌ జరిగింది. ఆ తర్వాత తనకు వ్యక్తిగత ప్రాబ్లమ్స్‌వల్ల ఆపారు. దాంతో నా కెరీర్‌ ఏమిటా అని అనుకున్నాను. ఆ టైమ్‌లో పూరీ, క్రిష్‌ పేర్లు వచ్చాయి. వాటికి చర్చలు జరిగాయి. ఆ తర్వాత అనుకోకుండా క్రిష్‌ బాలీవుడ్‌కు వెళ్లిపోవడం.. తర్వాత కొన్ని సమస్యలు ఎదురుకావడం వల్ల వాళ్ళతో చేయలేకపోయాను. అందుకే రెండేళ్ళపాటు ఆటుపోటులకు గురైంది.
 
మళ్ళీ వాళ్ళతో చేస్తారా?
తప్పకుండా.. చేస్తాను. త్వరలో పూరీ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మాతగా ఓ చిత్రం ఉంటుంది. క్రిష్‌ చిత్రం తర్వాత వుంటుంది.
 
పూజాహెగ్డేతో రొమాన్స్‌ ఎలా ఉంది?
నవ్వుతూ... నటిగా ఆమె సీనియర్‌.. నేను జూనియర్‌. కథ ప్రకారమే రొమాన్స్‌ వుంటుంది. అంతకంటే మా ఇద్దరి మధ్య ఏమీలేదు.
 
భవిష్యత్‌లో మీ వారసులమధ్య పోటీ వుంటుందా?
పోటీ అనేది ఎక్కడైనా వుంటుంది. ఈ పోటీకూడా చాలా స్పోర్టివ్‌గా వుంటుంది. అయినా ఎవరి హీరోయిజం సినిమా వారివి. ఒకరితో మరొకరు పోటీకాదనే నా అభిప్రాయం.