గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By IVR
Last Modified: సోమవారం, 7 జులై 2014 (18:31 IST)

విలన్‌గా చేయాలనుంది... విక్టరీ వెంకటేష్‌ ఇంటర్వ్యూ

''చాలా రోజుల తర్వాత సింపుల్‌ హ్యాపీ ఫామిలీ లైఫ్‌తో వచ్చిన కథను చేశాను. 27 సంవత్సరాల కెరీర్‌లో 'హైటైం'లో చేసిన సినిమా ఇది. రైట్‌ టైమ్‌ అనేది మన చేతుల్లో లేదు. కానీ హైటైం అనేది ఎప్పుడో వస్తుంది. ఈ జానర్‌లో థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ ఉన్న కథను ఎటెప్ట్ చేయలేదు. అది 'దృశ్యం'తోనే కుదిరింది'' అని విక్టరీ వెంకటేష్‌ అన్నారు. రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన 'దృశ్యం' చిత్రం ఈ నెల 11న విడుదలవుతుంది. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. వెంకటేష్‌కు మీనా భార్యగా నటించింది. ఈ చిత్రం గురించి వెంకటేష్‌ ఈ విధంగా చెప్పారు.
 
రాంబాబు క్యారెక్టర్ ఎలా ఉంటుంది? 
సింపుల్‌ కామన్‌‌మేన్‌ పాత్ర. భార్య, ఇద్దరు పిల్లలుంటారు. కుటుంబంతోపాటు డబ్బుకు విలువ ఇచ్చే వ్యక్తిగా నటించాను. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ పాత్ర. సినిమాలంటే పిచ్చి. అందులో వచ్చిన ప్రతి సినిమాను చూస్తాను. వాటి ప్రభావం కూడా ఉంటుంది. చక్కగా సాగే ఫ్యామిలీలో అలజడి లాంటి సంఘటన జరిగితే 'సందర్భానుసారంగా సినిమాల్లోని దృశ్యంతోనే డీల్‌ చేస్తాడు. చాలా కొత్తగా ఉన్న కథ ఇది. స్క్రిప్ట్‌లు మంచివి దొరకడం లేదని చెబుతుంటాం. దొరికాక ఇలాంటివి చేయడం కరెక్ట్‌ అని అనుకుంటాం. ఏ భాషలోనైనా ఇటువంటి కొత్త కథలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
బాగా నచ్చిన అంశం ఏమిటి... 
రీమేక్‌ చేయడానికి బాగా నచ్చిన అంశం. ఈ కథలో రాంబాబు పాత్ర సింపుల్‌సిటీ. ఫ్యామిలీ ఎమోషన్స్‌. ఈ సినిమా మలయాళంలో చూశాను. వెంటనే చేయాలనిపించింది. తెలుగులో మంచి ట్రెండ్‌కు ఉపయోగపడుతుంది.
 
రాంబాబు ఏడుస్తాడు... హీరోగా... 
ఎన్నో సినిమాల్లో ఎమోషన్స్‌ పండుతాయి. కోపం, దు:ఖం వంటివి సన్నివేశపరంగా ప్రేక్షకుడిని మూడ్‌లోకి తీసుకెళతాం. నా సినిమా కాదు ఇతర సినిమాల్లోనూ ఇలాగే ఉంటుంది. నా సినిమాలే కళ్ళనీళ్లు పెట్టిస్తాయని అంటారు. రాజా, ధర్మచక్రం, వసంతం, ప్రేమ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటివి ఎందరికో కనెక్ట్‌ అయ్యాయి.
 
మీనాతో 5వ సినిమా కదా...? 
అవును... మీనాతో కలిసి చేస్తున్న 5వ సినిమా. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం వంటి సక్సెస్‌‌ఫుల్‌ సినిమా తర్వాత కలిసి నటించాం. ఒక్కో సినిమా ఒక్కో తరహాలో ఉంటుంది. ఈ ఐదవ సినిమా కూడా కొత్తగా ఉంటుంది. ఒకరకంగా నాకన్నా మెచ్యూర్డ్‌గా నటించింది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు.
 
శ్రీప్రియ దర్శకత్వంలో ఎలా అనిపించింది? 
బిగినింగ్‌ డేస్‌లో హీరోయిన్‌గా చేశారు. ఆమెకు సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. సిన్సియర్‌ వర్కర్‌. అందరినీ కలుపుకుపోయే తత్త్వం ఆమెలో ఉంది. ఆమె దర్శకత్వంలో ఏమీ తేడా అనిపించలేదు. ఆమె చక్కగా డీల్‌ చేయగలరనే నమ్మాను.
 
రీమేక్‌లు చేయడానికి కారణం... 
ఒక్కోసారి కెరియర్‌లో అలా వస్తుంటాయి. అది రీమేకా? అనేది చూడను. కథ అందరికీ కనెక్ట్‌ అవుతుందా? లేదా? అనేది ఆలోచిస్తాను. నేను నటించిన 70 చిత్రాల్లో 50 చిత్రాలు స్ట్రెయిట్‌ కథలే. ఒక్కోసారి రీమేక్‌ కథలే తీసుకోవాల్సి వస్తుంది. అలాఅని తెలుగులో కథలు దొరక్క చేస్తున్నారనుకోవడం కూడా తప్పే. నా ఎర్లీ కెరియర్‌లో ఇటువంటి కథలు వచ్చేశాయి.  27 సంవత్సరాల కెరీర్‌లో మళ్ళీ 'ప్రేమించుకుందాం రా' వంటివి చేయలేను. మెచ్యూర్డ్‌ కథలే ఎంచుకుంటాను.  
 
మాతృకలో మార్పులు లేవు... 
ఈ చిత్రకథ యూనివర్సల్‌. చక్కటి స్క్రీన్‌ప్లే.. స్క్రిప్ట్‌ చాలా క్లియర్‌గా ఉంది. పోస్టర్‌ విడుదలయ్యాక. వెంకీ ఇద్దరు పిల్లలతో చాలా కొత్తగా ఉన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇలాంటి చిత్రాల కోసమే ఎదురుచూస్తున్నారన్నారు.
 
మల్టీస్టారర్‌ చిత్రాలు ? 
స్క్రిప్ట్‌లో మంచిగా అనిపిస్తే చేస్తూనే ఉంటాను. ఇప్పటి యంగ్‌ హీరోలు నాకు క్లోజ్‌ఫ్రెండ్స్‌.. దర్శకులు కూడా మంచి కథలు చెబితే చేస్తాను. 
 
బుల్లితెరపై...? 
ఇంకా ఆలోచన లేదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేను. అలాగే భవిష్యత్‌లో నిర్మాతగానో, దర్శకుడిగానో మారాలనే కోరికలేదు. నిర్మాతగా అస్సలు లేదు. ఎందుకంటే నేను చేసేవన్నీ నేనే నిర్మాతగా ఫీలయి చేస్తుంటాను.
 
గోపాల గోపాల... గురించి.. 
ఇప్పుడే ఫస్ట్‌ షెడ్యూల్‌ జరిగింది. తర్వాత షెడ్యూల్లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చేస్తాను. మిథున్‌ చక్రవర్తి కూడా ఇందులో నటిస్తున్నాడు. ఒరిజినల్‌ను ఏమాత్రం మార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంచెం నేటివిటీ మారుతుంది. హిందీలో ఈ స్క్రిప్ట్‌ చూశాక.. ఎంతో నచ్చింది. దేవుడి మీదే కేసు వేయడం అనే కాన్సెప్ట్‌ చాలా కొత్తగా ఉంది.
 
మీ అబ్బాయి అర్జున్‌ గోపాల గోపాలలో నటిస్తున్నాడా... 
గోపాల గోపాల... షూటింగ్‌ సమయంలో అర్జున్‌ కూడా వచ్చాడు. చాలామంది చైల్డ్‌ ఆర్టిస్టుగా అడుతున్నారు. కానీ ఇప్పుడు తను చదువుకుంటున్నాడు. 'కరాటే కిడ్‌' అనే సినిమా చేస్తున్నట్లు ఎక్కడో రాశారు. అవన్నీ కరెక్ట్‌ కాదు.
 
ఇంకా ఈ పాత్ర చేస్తే బావుంటుంది అని అనుకుంటున్నారా... 
విలన్‌గా చేయాలనుంది. దాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో చూడాలి. రచయితలు, దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ 'నాగవల్లి'లో అలాంటి షేడ్‌ ఉన్న రోల్‌ చేసి దెబ్బతిన్నాను. ఫ్యూచర్‌లో ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలీదు.
 
కమల్‌తో చాటింగ్‌... 
'దృశ్యం' తమిళ వర్షన్‌ కమల్‌ హాసన్‌ చేస్తున్నాడు. ఈ సినిమా విషయమై చాలాసార్లు ఛాటింగ్‌లో మాట్లాడుకున్నాం. సలహాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నాం. తను బాలనటుడి నుంచి ఎన్నో ప్రయోగాలు చేశాడు. ప్రపచంలో బహుశా ఎవ్వరూ చేయని చిత్రాలు టచ్‌ చేశాడు. ఆమధ్య గోవా ఫెస్టివల్‌లో కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
 
మోహన్‌లాల్‌ బాగా చేశారు కదా...
మలయాళంలో మోహన్‌లాల్‌ బాగా పోషించాడు. అక్కడ పెద్ద హిట్‌ సినిమా. ఆయన చిత్రాన్ని నేను చేయడం ఆనందంగా ఉంది. స్క్రిప్ట్‌లో కొన్ని డౌట్స్‌ ఉంటే ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకున్నాను. నా కెరీయర్‌ బిగినింగ్‌లో ఆయన నటించిన చిత్రాలు చూశాను. ఆయన నటన, వాయిస్‌ పెక్యూలర్‌గా ఉంటుంది. ఆయన చేసిన కొన్ని సబ్జెక్ట్‌లు చేయలేకపోయాను. ఇది కుదిరింది.
 
పాతరోజులు వస్తున్నాయా.... 
ఇప్పుడుడిప్పుడే ఫ్యామిలీ చిత్రాలు వస్తున్నాయని ఇండస్ట్రీ భావిస్తోంది. సీతమ్మ వాకిట్లో... మనం.. చిత్రాల తర్వాత దృశ్యం.. చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటివి మరిన్ని రావాలి. పాతరోజులు వస్తున్నాయని అంటున్నారు. వస్తే చూస్తాం. రానప్పుడు ఎదురుచూస్తాం. 
 
ఫ్యామిలీ అంతా కలిసి...?
నాగేశ్వరరావుగారికి అంజలి ఘటించేట్లుగా 'మనం' స్క్రిప్ట్‌ లక్కీగా దొరికింది. చక్కటి స్క్రిప్ట్‌ దొరికితే మా కుటుంబమంతా కలిసి చేయాలని ఉంది. ఇంకా ఆ తరహా స్క్రిప్ట్‌ రాలేదు. అన్నీ రొటీన్‌గానే ఉంటున్నాయి.
 
ప్రేక్షకుడిగా దృశ్యం మీకెలా అనిపించింది....
ఒక ప్రేక్షకుడిగా దృశ్యం సినిమా నాకు బాగా నచ్చింది. నా కెరీర్‌లో మరో మెట్టు ఎక్కేదిగా ఉంటుంది. ఫ్యాన్స్‌ కూడా మెచ్చుకుంటారు. హై టెక్నీషియన్స్‌, హై బడ్జెట్‌ సినిమా ఇది.
 
వివేకానంద సినిమా గురించి...
ఇంకా ఏమీ అనుకోలేదు. అలాంటి స్క్రిప్ట్‌ ఏదీరాలేదు.
 
రాధా లేనట్లేనా...
మారుతీ దర్శకత్వంలో 'రాధా' సినిమా లేనట్లే. అదిగో వస్తుంది. ఇదిగో అంటూ వార్తలు రాస్తున్నారు. అవేమీ నిజంకాదు.
 
దృశ్యం చిత్రంపై...
చక్కటి కథ, స్క్రీన్‌ప్లే బేస్డ్‌ స్టోరీ. చక్కని ఎమోషన్స్‌ ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు.. నాకే జరుగుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. చాలామంది అది యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీ చిత్రాలు అని విడిగా చెబుతుంటారు. అలాంటి సినిమాలు వంద వస్తే అందులో 10 శాతమే ఆడుతున్నాయి. అంటే ఎక్కడో ఒక చోట ఒక్కక్కరికి కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుంది.