శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:37 IST)

ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌ని ముగించడం ధోనీ నుంచే నేర్చుకోవాలి: త్రిపాఠీ షాక్

లక్ష్యఛేదనలో ప్రపంచ క్రికెట్ లోనే మహేంద్ర సింగ్ ధోనీ అంత ప్రమాదకరమైన ఫినిషర్‌ మరొకరు లేరని క్రికెట్ దిగ్గజాలు ముక్తకంఠంతో కొనియాడటం పాత విషయమే. కానీ ధోనీ ఆటను టీవీల్లో చూస్తూ అబ్బురపడుతూ క్రికెట్‍‌లో

లక్ష్యఛేదనలో ప్రపంచ క్రికెట్ లోనే మహేంద్ర సింగ్ ధోనీ అంత ప్రమాదకరమైన ఫినిషర్‌ మరొకరు లేరని క్రికెట్ దిగ్గజాలు ముక్తకంఠంతో కొనియాడటం పాత విషయమే. కానీ ధోనీ ఆటను టీవీల్లో చూస్తూ అబ్బురపడుతూ క్రికెట్‍‌లో ఓనమాలు నేర్చుకుని ఐపీఎల్‌లో అడుగుపెట్టిన యువ క్రికెటర్లు ఇప్పుడు ప్రత్యక్షంగా ధోనీ ఆటను, అతడి కూల్ నెస్‌ని ప్రత్యక్షంగా మైదానంలో చూస్తూ తరించిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. పుణే సూపర్ జెయింట్స్ సంచలనం రాహుల్ త్రిపాఠీకి ఇప్పుడు ధోనీ ఒక ఆరాధ్య దైవం లెక్క. చేజింగ్‌లో చివరి ఓవర్లలో అంత ఒత్తిడిని ఎదుర్కొని మ్యాచ్ ముగించడం ఎలా అనేది నిజంగా ధోనీ నుంచే నేర్చుకోవాలి అని ఉబ్బేస్తున్నాడు త్రిపాఠీ. లేని పరుగుకోసం ప్రయత్నించి తన వీరబాదుడుకు అడ్డుతగిలి రనౌట్ కావడానికి ధోనీయే కారణమైనా ధోనీ విజృంభణ ముందు ఆ బాధ మర్చిపోయాడు త్రిపాఠీ.
 
ధోని మ్యాచ్‌లను ఫినిష్ చేసే విధానాన్నిగతంలో టీవీలో చూశాను. కానీ.. ప్రత్యక్షంగా మరో ఎండ్ నుంచి చూసి ఆశ్చర్యపోయాను. అంత ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌ని ముగించడం ఎలా అనేది నిజంగా అతడి నుంచే నేర్చుకోవాలి’ అని రాహుల్  త్రిపాఠి సన్ రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించిన అనంతరం వివరించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి (59; 41 బంతుల్లో 6×4,  3×6) మెరుపు అర్ధశతకంతో రైజింగ్ పుణె జట్టుకి 177 పరుగుల ఛేదనలో మెరుపు ఆరంభమిచ్చిన విషయం తెలిసిందే. ఓపెనర్  రహానె (2) ఆదిలోనే పెవిలియన్ చేరినా.. ఏమాత్రం బెదరకుండా భారీ షాట్లు ఆడిన త్రిపాఠి వరుస బౌండరీలు బాదేశాడు. 
 
బెంగళూరు, గుజరాత్ జట్లపై విఫలమైన ఈ యువ హిట్టర్ హైదరాబాద్‌పై అర్ధశతకం బాది జట్టులో గట్టి పునాది వేసుకున్నాడు. చివర్లో ధోనీ (61 నాటౌట్) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పుణె జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.