గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (09:35 IST)

ఐపీఎల్ 2017: ధోనీ మెరుపులు... పూణె ఉత్కంఠ విజయం.. హెన్రిక్స్‌ మెరుపులు వృథా

ఐపీఎల్ 2017 పదో అంచె పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ ఆటతో సొంత జట్టు పూణెకు విజయాన్ని అందించాడు. చాలా రోజుల తర్వాత తన మార్క్ బ్యాటింగ్‌తో ధోనీ ఆలరించాడు. తద్వారా..

ఐపీఎల్ 2017 పదో అంచె పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ ఆటతో సొంత జట్టు పూణెకు విజయాన్ని అందించాడు. చాలా రోజుల తర్వాత తన మార్క్ బ్యాటింగ్‌తో ధోనీ ఆలరించాడు. తద్వారా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో తనను పక్కనబెట్టడం తప్పని జట్టు యాజమాన్యానికి తెలియజెప్పాడు. 
 
ఈ మ్యాచ్‌లో జార్ఖండ్‌ డైనమైట్‌ ధోనీ (61 నాటౌట్‌; 34 బంతుల్లో 5×4, 3×6) రాణించాడు. చివరి బంతివరకూ ఉత్కంఠ కలిగించిన మ్యాచ్‌లో పుణె 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. హెన్రిక్స్‌ (55 నాటౌట్‌; 28 బంతుల్లో 6×4, 2×6) చెలరేగడంతో మొదట సన్‌రైజర్స్‌ 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్‌ (43; 40 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. ధోనీతో పాటు రాహుల్‌ త్రిపాఠి (59; 41 బంతుల్లో 6×4, 3×6) అదరగొట్టడంతో లక్ష్యాన్ని పుణె ఆఖరి బంతికి ఛేదించింది. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగినప్పటికీ సన్‌రైజర్స్‌ వేగంగా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. ఇన్నింగ్స్‌లో చాలా భాగం మందకొడిగా సాగింది. ఓపెనర్లు వార్నర్‌, ధావన్‌ (30; 29 బంతుల్లో 5×4) చాలాసేపే నిలిచినా బ్యాటు ఝుళిపించలేకపోయారు. 9వ ఓవర్లో ధావన్‌ ఔటయ్యే సమయానికి స్కోరు 55 పరుగులు. పరుగుల కోసం శ్రమించిన వార్నర్‌ ఆ తర్వాత కూడా బ్యాటు ఝుళిపించలేకపోయాడు. 
 
13 ఓవర్లయ్యేసరికి విలియమ్సన్‌ (21; 14 బంతుల్లో 1×4, 1×6) వికెట్‌ను కూడా చేజార్చుకున్న సన్‌రైజర్స్‌ 85/2తో నిలిచింది. కానీ చప్పగా సాగిపోతున్న సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌కు హెన్రిక్స్‌ ఊపు తెచ్చాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బాదుడుకు చివరి ఏడు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 91 పరుగులు పిండుకుంది. వార్నర్‌తో మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించిన హెన్రిక్స్‌.. 17వ ఓవర్లో అతడు నిష్క్రమించాక మరింత రెచ్చిపోయాడు. ధాటిగా ఆడిన హూడా (19 నాటౌట్‌; 10 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి అభేద్యమైన నాలుగో వికెట్‌కు 21 బంతుల్లోనే 47 పరుగులు జోడించాడు. ఫలితంగా 176 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పూణె జట్టు... ధోనీ విజృంభణతో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే (2) త్వరగానే నిష్క్రమించినా.. మరో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి కళ్లు చెదిరే షాట్లతో అలరించడంతో పుణె ఇన్నింగ్స్‌కు గట్టి పునాదే పడింది. అలాగే, కెప్టెన్‌ స్మిత్‌ నిలవగా.. త్రిపాఠి ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పుణె 10 ఓవర్లకు 83/1తో నిలిచింది. 
 
అయితే, క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన స్మిత్‌ (27; 21 బంతుల్లో 1×4, 2×6) 11వ ఓవర్లో ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. క్రీజులోకి వచ్చిన ధోనీ గత మ్యాచ్‌ల్లో లాగే వేగంగా ఆడలేకపోయాడు. పరుగుల కోసం కష్టపడ్డాడు. మరోవైపు త్రిపాఠి కూడా ఔట్‌ కావడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 15 ఓవర్లకు స్కోరు 115/3 కాగా.. ధోనీ 15 బంతుల్లో 17 పరుగులతో ఉన్నాడు. అప్పటికి పుణె గెలవాలంటే 30 బంతుల్లో 62 పరుగులు చేయాలి. 
 
సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో పుణెకు కష్టమే అనిపించింది. తర్వాతి రెండు ఓవర్లలో 15 పరుగులే చేసిన పుణె.. స్టోక్స్‌ను కూడా కోల్పోవడంతో పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారింది. కానీ 18వ ఓవర్‌ నుంచి ధోనీ విరుచుకుపడడంతో మ్యాచ్‌ వేగంగా పుణె వైపు తిరిగింది. ఆ ఓవర్లో మనోజ్‌ తివారి ఓ ఫోర్‌ కొట్టగా.. ధోనీ వరుసగా 6, 4 దంచేశాడు. తర్వాతి ఓవర్లో (భువనేశ్వర్‌) ధోనీ మరింత చెలరేగాడు. వరుసగా 4, 4, 6తో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 
 
చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి మనోజ్‌ తివారి బౌండరీ కొట్టాడు. రషీద్‌ క్యాచ్‌ వదిలేయడం పుణెకు కలిసొచ్చింది. ఐతే కౌల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తర్వాతి నాలుగు బంతుల్లో 1, 1, 1, 2 మాత్రమే వచ్చాయి. ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే ధోనీ ఎక్స్‌ట్రా కవర్‌లో బౌండరీ బాది ఉత్తమ ఫినిషర్‌గా తనకున్న పేరును నిలబెట్టుకున్నాడు. తద్వారా క్రికెట్‌లో తన పని అయిపోలేదని చాటిచెప్పాడు.