శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:42 IST)

ఐపీఎల్ 8: రాజస్థాన్ రాయల్స్ అదుర్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి!

ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ విజయ పరంపరను ధోని సేన అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. దీంతో అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్,రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్ధాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్‌లో 15వ మ్యాచ్‌ అయిన ఇందులో రాజస్ధాన్ రాయల్స్ ఓపెనర్లు 157 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా చేధించారు.
 
ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, అజ్యంకే రహాన్ ఏ మాత్రం తడబడకుండా తొలి వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ షేన్ వాట్సన్ 47 బంతుల్లో 73 పరుగులు, రహానే 55 బంతుల్లో 76 నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరి భాగస్వామ్యం చెన్నైపై రాజస్థాన్ జట్టు అలవోకగా విజయం సాధించడంలో దోహదపడటంతో పాటు, ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు వరుసగా ఐదవ విజయాన్ని కైవసం చేసుకుంది. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ మొదటి నుంచి ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. ధోనీ సేనలో మెక్ కల్లమ్ 12, డుప్లెసిస్ 1, రైనా 4 పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. అయితే ధోనీ నిలకడగా ఆడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఐదో వికెట్‌కు ధోని-బ్రావో జోడి 91 పరుగులు చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్ 8వ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న ధోని సేనకు రాజస్ధాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.