శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2015 (17:30 IST)

ఐపీఎల్ 8.. 21 బాల్స్ 45 పరుగులు: సర్ఫరాజ్ ఖాన్‌కు కోహ్లీ నమస్తే.. టీమిండియాలో స్థానం!?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అనే యువ క్రికెటర్ అదుర్స్ అనిపించుకుంటున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ బుధవారం రాజస్థాన్ రాయల్స్ పై 21 బంతుల్లో 45* పరుగులు చేశాడు.

ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ అంటే అంతగా ఎవ్వరికీ తెలీదు. కానీ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి దృష్టి ఆకర్షించాడు.
 
వాట్సన్, ఫాక్నర్ వంటి దిగ్గజ బౌలర్లతో కూడిన రాయల్స్ బౌలింగ్‌ను చితకబాదాడు. ఏబీ డివిలియర్స్ వంటి బ్యాటింగ్ దిగ్గజం ఉన్న జట్టులో అతడికంటే ఎక్కువ ఫేమ్ కొట్టేయడం మాటలుకాదు. డివిలియర్స్ రనౌట్ కావడంతో నిరుత్సాహం చెందిన ప్రేక్షకులు ఆ తర్వాత బరిలోదిగిన సర్ఫరాజ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయారు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కెప్టెన్ కోహ్లీ అంతటివాడు సర్ఫరాజ్‌కు నీరాజనం పలకడం మామూలు విషయంకాదు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న అత్యంత పిన్నవయస్కుడు సర్ఫరాజే. ఈ ముంబైవాలా వయసు 17 ఏళ్లే. అయినా, ప్రతిభ పరంగా సీనియర్లకు పోటీ ఇస్తున్నాడు. టీమిండియాకు ఆశాకిరణంగా కనిపిస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అన్ని రకాల షాట్లు ఆడడంలో దిట్ట. నిన్నటి మ్యాచ్‌లో అతనాడిన ఇన్నింగ్స్ నిడివి స్వల్పమే అయినా, అన్ని రకాల అస్త్రాలతో అలరించాడు. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడితే టీమిండియా బెర్తు కోసం ఎక్కువకాలం వేచి చూడక్కర్లేదని క్రీడా పండితులు అంటున్నారు.