శనీశ్వరుని సంరక్షణలో షింగ్నాపూర్

Gayathri|
ప్రజలు శనిదేవుని ఎంతగా కొలిచినా కులదైవాలు, గ్రామదేవతల తర్వాతే! ముందు వారికి నైవేద్యాలు తదితరాలు సమర్పించిన తర్వాతే శనీశ్వరుని కొలుస్తారు మనవాళ్లు. అయితే శనిభగవానుడే అన్నీ అంటూ ఓ ఊరి ప్రజలు ఆయననే కీర్తిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని షింగ్నాపూర్ గ్రామ ప్రజలకు శనిదేవుడే కులదైవం.

ఆయనను ఎంతగా కొలుస్తారంటే గ్రామంలోని ఇళ్లకు తలుపులు కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా గడియలు ఉండవు. వాళ్లసలు దొంగతనం గురించే ఆలోచించరు. శనీశ్వరుడు మా ఊరిని కాపాడుతుంటే మాకెందుకు భయం? అని ప్రశ్నిస్తారు. నిన్న... ఇవాళ్ల... కాదు ఇలా గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లు శనీశ్వరుడిని పూజిస్తున్నారు. ఊహ తెలిసినప్పట్నుంచీ... శనీశ్వరుడినే పూజిస్తున్నాం. గ్రామంలో జరిగే శుభపరిణామాలన్నిటికీ శనిభగవానుడే కారణం అంటున్నారు ఆ గ్రామ ప్రజలు.

ఒక వేళ వీళ్ల గ్రామం గురించి తెలిసి దొంగలించేందుకు ఎవరైనా వస్తే? ఏం చేస్తారు? అని అడిగితే అలా దొంగిలించే వారు ప్రాణాలతో ఉండరు. శనిభగవానుడు వారిని ఊరికే వదలడు అని నమ్మకంగా చెబుతున్నారు వాళ్లు. ఈ ఊరి శనేశ్వరాలయంలో శనిభగవానునికి ప్రత్యేకంగా రూపం, విగ్రహం అంటూ ఏదీ ఉండదు. ఓ రాయి మాత్రమే ఉంటుంది. దీనినే ఆ ఊరి ప్రజలు శనీశ్వరుడిగా భావిస్తూ ఏళ్ల తరబడిగా భక్తితో కొలుస్తున్నారు.

పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరుని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఆలయంలోని శనీశ్వరునికి నూనె లేదా నీళ్లతో అభిషేకం చేస్తారు. శనిఅమావాస్య నాడు ఆలయం కోలాహలంగా మారిపోతుంది. గ్రామంలోని ప్రజలందరూ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఊరిలో శనీశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. అయితే ఆలస్యం ఎందుకు మీరు కూడా బయలుదేరండి మరి!


దీనిపై మరింత చదవండి :