శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. ఇదీ సంగతి
Written By Munibabu

సూర్య భగవానుడు కోరివచ్చే వేదానారాయణుడి ఆలయం

భారతదేశంలో భక్తికి, దానికి నిలయమైన దేవాలయాలపై ప్రజలకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. కేవలం భక్తికి నిలయాలుగానే కాక ఒక్కో క్షేత్రం ఒక్కో విశిష్టతను కలిగి ఉండడంతో కాలం ఎంత నవీనమవుతున్నా మనిషిలో భక్తి భావం ఇంకా నిలిచి ఉండేందుకు ఇవి తోడ్పడుతున్నాయి.

ప్రాచీనకాలం నుంచి ఎన్నో విశేషాలకు, అద్భుతాలకు భారతదేశంలోని ఆలయాలు ప్రత్యక్ష సాక్షాలుగా నిలుస్తున్నాయి. అలాంటి ఓ అద్భుత విశేషాన్ని కల్గిన ఆలయమే చిత్తూరు జిల్లాలోని నాగలాపురంలో వెలసిన శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణస్వామి ఆలయం.

ఈ ఆలయంలో మహా విష్ణువు వేదనారాయణస్వామి రూపంలో వేదవల్లి సమేతుడై కొలువున్నాడు. అలాగే ఈ ఆలయంలో దక్షిణ భాగంలో శివుడు దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉండగా ఉత్తరంగా బ్రహ్మ కొలువై ఉన్నాడు. దీంతో ఈ ఆలయం త్రిమూర్తులు వెలసిన క్షేత్రంగానూ విలసిల్లుతోంది.

ఈ ఆలయానికున్న విశిష్టతను గమనిస్తే ప్రతి ఏడాది సరిగ్గా మార్చి 23న సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇలా ప్రవేశించే కిరణాలు 25, 26, 27 తేదీల్లో మొదటి రోజు స్వామివారి పాదాలపై ప్రకాశిస్తాయి. అలాగే రెండో రోజు స్వామి వారి నాభి ప్రదేశంలో పడి భక్తులను పరవశానికి గురిచేస్తాయి.

ఇక మూడోరోజు సూర్య కిరణాలు స్వామి వారి శిరస్సు భాగంలో ప్రకాశితమై భక్తులకు నయనానందాన్ని కల్గిస్తాయి. ఇలా ఏడాదిలో ఐదురోజులపాటు ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించే సూర్యకిరణాలు మిగిలి రోజుల్లో కన్పించకపోవడం విశేషం. ఇలా సూర్యకిరణాలు గర్భగుడిలో ప్రవేశించే ఐదు రోజులపాటు ఈ ఆలయంలో సూర్యపూజోత్సవాలు నిర్వహిస్తారు.


సూర్యకిరణాలు ఇలా గర్భగుడిలో ప్రవేశించి స్వామివారిపై పడడానికి పూరాణ ఆధారమైన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. అలనాడు సోమకుడనే రాక్షసుడు దేవతలకు సంబంధించిన వేదాలను తస్కరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దాంతో దేవతలంతా కలిసి మహావిష్ణువును శరణు కోరగా ఆయన మత్య్సా అవతారంతో సముద్ర గర్భంలోకి వెళ్లి ఆ రాక్షసున్ని సంహరించి వేదాలను తిరిగి దేవతలకు అప్పగించాడు.

అయితే రాక్షసునితో పోరాడడం కోసం సముద్ర గర్భంలో కొద్దిరోజులపాటు గడపడం వల్ల మత్య్సా అవతారుడైన మహావిష్ణువు శరీరం మంచులా మారిపోయింది. దీంతో విష్ణువు బాధను హరింపజేయడానికి సూర్య భగవానుడు విష్ణువు దేహంపై తన కిరణాలను ప్రసరింపజేసి ఆయనకు స్వస్థత చేకూర్చారు.

ఇలా విష్ణుమూర్తి సేవకోసం సూర్య భగవానుడు ఏడాదిలో కొద్దిరోజులు వేదనారాయణుడి దేహంపై ప్రసరిస్తాడని భక్తుల విశ్వాసం.

పురాణగాథను కాసేపు పక్కనబెడితే ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఎక్కడో ఆలయం లోపల ఉన్న స్వామివారిపై సూర్య కిరణాలు ప్రసరించడం నిజంగా విశేషం.

అలయ ముఖద్వారం నుంచి గర్భగుడిలోని స్వామివారి వద్దకు దాదాపు 610 అడుగుల దూరం ఉంటుంది. అలాగే ఆలయ ప్రధాన ద్వారం నుంచి గర్భగుడి చేరుకునే దారిలో 10 ద్వారాలుంటాయి. ఇన్ని ద్వారాలు దాటి సూర్యకిరణాలు స్వామివారిపై పడడం నిజంగా కలియుగ అద్భుతంగా చెప్పుకోవచ్చు.

ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం వల్లే ఇలాంటి వింతలు జరుగుతుంటాయని హేతువాదులు కొట్టిపారేసినా కళ్లముందు కనబడే ఈ అద్భుతాన్ని చూస్తున్నప్పుడు మాత్రం మనలో అపారమైన భక్తి భావం పుట్టుకురాకుండా ఉండదు.