గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:39 IST)

ఐటీ రంగంలో దూసుకెళుతున్న భారత్ : గవర్నర్ కె. రోశయ్య

ఐటీ రంగంలో భారత్ దూసుకెళుతోందని తమిళనాడు గవర్నర్ కె రోశయ్య అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ మేధావులు ఐటీ రంగంలో ముందంజలో ఉన్నారన్నారు. ‘ఇండియాఫైల్లింగ్స్‌’ మొబైల్‌ ఆప్‌‌ను ఆయన చెన్నైలో ఇటీవల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో సాంకేతిక ప్రగతి వేగమందుకుందన్నారు. దేశంలో మానవవనరులకు, మేధాశక్తికి తిరుగులేదన్నారు. 
 
కాగా ప్రపంచంలో 6.8 మిలియన్‌ మొబైల్‌ ఫోన్లు వాడకంలోఉండగా భారత్‌లోనే 970 మిలియన్‌ ఫోన్లు ఉన్నట్లు గణాంకాలు రుజువుచేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత జనాభాలో 78 శాతం ప్రజలు మొబైల్‌ ఫోన్లు కలిగి ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఫోన్ల వినియోగంలో కూడా ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఆండ్రాయిట్‌ టచ్‌, స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌ విస్తృతంగా వాడకంలోఉన్నట్లు తెలిపారు. ప్రపంచంలోమొబైల్‌ ఫోన్‌ వాడకంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ మనం ఇంతా ఎంతో ప్రయాణించవలసి ఉందన్నారు. 
 
దేశంలో ప్రస్తుతం యువత స్వయం ఉపాధికి ప్రాధాన్యతనివ్వడం సంతోషం కలిగించే అంశంగా ఉందన్నారు. వ్యాపారం, పరిశ్రమల ద్వారా ఉపాధి పొందడం ఆర్థిక రంగానికి ఊతమిస్తుందన్నారు. యువతలో 13 శాతం మంది వృత్తిలో వేగంగా ఎదుగుతూ, సీసీఓ స్థాయికి చేరుకోవాలనుకుంటూ ఉండగా, 67 శాతం మంది స్వంతంగా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించాలని భావిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయని గవర్నర్‌ గుర్తు చేశారు. దేశ అభివృద్ధిలో ‘ఎంటర్‌ప్రెన్యూర్స్‌’ ప్రముఖ పాత్ర వహిస్తారన్నారు. 
 
మారుతున్న సాంకేతిక ప్రగతిని అందిపుచ్చుకోవడం, ప్రపంచ నాణ్యత కలిగిన ఉత్పత్తులను రూపొందించడం భారత యువత ముందున్న సవాళ్లన్నారు. ఆరోగ్య రక్షణ, ఇంజనీరింగ్‌ పరిశ్రమలు, ఉత్పాదక రంగం తదిగరాల్లో వ్యాపారావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. విదేశాల నుంచి నిపుణులను రప్పించడం ఎంతో ఖర్చుతో కూడుకుందన్నారు. 
 
అందుకు మారుగా స్థానిక యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వడం మంచి ఫలితాలనిస్తుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపుతో యువత పెద్ద ఎత్తున వ్యాపార రంగంలో అడుగుపెడుతోందన్నారు. ఈ సందర్భంగా ఇండియాఫైల్లింగ్‌ ప్రతినిధులు ఎల్‌. ఛార్లెస్‌, లినోల్‌ ఛార్లెస్‌‌లను అభినందిస్తున్నట్లు రోశయ్య తెలిపారు.