శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జనవరి 2016 (16:48 IST)

కాల్‌డ్రాప్‌ : ప్రతి కాల్‌కు రూపాయి చెల్లించాల్సిందే.. ట్రాయ్‌ లేఖ

కాల్‌డ్రాప్స్‌ విషయంలో టెలికాం ఆపరేటర్లు, ట్రాయ్‌ సంస్థ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జనవరి 1 నుంచి ప్రతి కాల్‌ డ్రాప్‌కు రూపాయి చొప్పున వినియోగదారులకు పరిహారం ఇవ్వాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) సంబంధిత టెలికాం సంస్థలకు లేఖ రాసింది. అయితే తాము కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూస్తామని టెలికాం సంస్థలు తేల్చి చెప్పాయి. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 
 
అప్పటివరకు టెలికాం సంస్థలపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం సూచించింది. నెట్‌వర్క్‌ సమస్యతో ఫోన్‌ కాల్‌ మధ్యలో కట్‌ అయిపోవడాన్ని కాల్‌డ్రాప్‌ సమస్యగా పేర్కొంటున్నారు. ఈ సమస్యపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో జనవరి ఒకటి నుంచి ప్రతి కాల్‌డ్రాప్‌కు రూపాయి చొప్పున టెలికాం సంస్థలు వినియోగదారుడికి చెల్లించాలంటూ ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 
 
అయితే దీని వల్ల తమకు వేల కోట్ల నష్టం వస్తుందని.. తాము పరిహారం ఇవ్వలేమని టెలికాం సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ట్రాయ్‌ ఆదేశాలపై కోర్టు ఎలాంటి స్టే విధించనప్పటికీ.. విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ మళ్లీ లేఖ రాసింది.