బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:45 IST)

వాట్సప్ గ్రూప్ చాటింగ్ యాప్: యూజర్ల సంఖ్య 100 నుంచి 256కు పెంపు!

వాట్సప్... ప్రస్తుతం అత్యంత ఆదరణ కలిగిన యాప్. మొబైల్‌లో టాక్‌టైమ్ లేకపోయినా కేవలం నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు.. ఈ యాప్ సహాయంతో ఎవరితోనైనా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. వీడియో చాట్ చేసుకోవచ్చు. గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఒకరి భావాలు ఒకరు పంచుకోవచ్చు. అంటువంటి ఈ వాట్సప్‌కు నేటి యువత హ్యాట్సాప్ అంటున్నారు... ఇటీవల కాలంలో యువత నుంచి పెద్దల వరకు అందరూ వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. 
 
వాట్సప్ వినియోగదారులు చాలా మంది సింగిల్ చాటింగ్‌కి కాకుండా గ్రూప్ చాటింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. అలా గ్రూప్ చాట్ చేసేవారికి వాట్సప్ ఓ శుభవార్తనందించింది. ఈ యాప్‌లో గ్రూప్ చాటింగ్ చేసే యూజర్ల సంఖ్యని ఏకంగా 256కు పెంచారు. ఇంతకు ముందు ఒక గ్రూప్‌లో కేవలం 100 మంది వరకు పరిమితంగా ఉండేది. కాని ఇప్పుడు 256 మందిని గ్రూప్‌లో చేర్చుకునే వీలుని యూజర్లకు కల్పించింది.
 
గ్రూప్ యూజర్ల సంఖ్య పెంపు ఫీచర్ కలిగిన కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు సంబంధిత ప్లే స్టోర్‌లలో లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లు 2.12.437 వెర్షన్ ద్వారా, ఐఓఎస్ యూజర్లు 2.12.13 వెర్షన్‌లను తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ అప్‌డేటెడ్ ఫీచర్‌ను పొందేందుకు అవకాశం ఉంది. అయితే విండోస్ మొబైల్, బ్లాక్‌బెర్రీ తదితర ఫోన్లకు కూడా ఈ సదుపాయాన్నివిస్తరిస్తామని వాట్సాప్ సంస్థ ప్రతినిధి సగౌరవంగా తెలిపారు.
 
ఇటీవలే 100 కోట్ల యాక్టివ్ యూజర్ల మార్కును కొట్టేసి రికార్డు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్ల ద్వారా వాట్సప్‌ను వాడుకునేలా మరో కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ యూజర్లను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే మరి.