శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జులై 2016 (12:06 IST)

వైఫై వేగం నెమ్మెదిగా ఉందా.... అయితే స్పీడ్ పెంచుకోండిలా!

ఇటీవలి కాలంలో వైపై వాడుక విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కార్యాలయాల్లోనే కాదు, బహిరంగ ప్రదేశాల్లో... చివరికి ఇంట్లోనూ పెరిగిపోయింది. గతంలో వైర్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా పీసీకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట

ఇటీవలి కాలంలో వైపై వాడుక విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కార్యాలయాల్లోనే కాదు, బహిరంగ ప్రదేశాల్లో... చివరికి ఇంట్లోనూ పెరిగిపోయింది. గతంలో వైర్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా పీసీకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ వాడుకునేవారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్ టాప్‌ల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో వైఫై రూటర్లతో ఒకే ఇంట్లో కంప్యూటర్‌తో పాటు పలు స్మార్ట్ ఫోన్లలో వైర్ లెస్ విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, వైఫై కొన్ని సమయాల్లో స్లో అవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఎందుకిలా...? దీనికి పరిష్కారం ఏమిటి...?
 
పట్టణాలు, నగరాల్లో సాధారణంగా వైఫై వాడకం ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్లల్లో అందరూ వైఫై వాడుతుంటే వాటి తరంగాలు ఒకదానికొకటి అడ్డుపడే పరిస్థితి  ఏర్పడుతుంది. 2.4 గిగాహెడ్జ్ స్థాయిలో ఎక్కువగా వైఫై రూటర్ తరంగాల వ్యాప్తి ఉంటుంది. కొత్త రూటర్ల కంటే పాత రూటర్లతోనే ఈ సమస్య ఎదురవుతుంటుంది. అందుకే రూటర్ సెట్టింగ్స్‌లో ఫ్రీక్వెన్సీ చానల్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
వైఫై రూటర్ ఇంట్లో ఎక్కడ పెట్టారన్నది కీలకమైన అంశమే. స్లో సమస్య వేధిస్తుంటే స్థలాన్ని మార్చి చూడండి. వైఫై రూటర్ ఉన్న చోట కాంక్రీటు, మెటల్ వస్తువులు లేకుండా చూడాలి. ఎందుకంటే వైఫై తరంగాలను ఇవి అడ్డుకుంటాయట. 
 
వైఫై రూటర్ సిగ్నల్స్ 360 డిగ్రీల కోణంలో ప్రసారం అవుతుంటాయి. అందుకే ఇంటి మధ్య భాగంలో ఎత్తయిన ప్రదేశంలో రూటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిపుణుల సలహా. దీనివల్ల స్పీడ్ పెరగడంతోపాటు కవరేజీ ఏరియా కూడా పెరుగుతుంది. రూటర్ యాంటెనా నుంచి సిగ్నల్స్ కొంచెం కిందకు ప్రసరించేలా ఉంటాయట. అందుకే ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. 
 
వైఫై రూటర్‌కు ఉండే రెండు యాంటెనాలు ఒకదాన్ని నిలువునా (వెర్టికల్), ఒకదాన్ని హారిజాంటల్ (అడ్డంగా)గా ఏర్పాటు చేసుకోవాలి. కొత్తతరం వైఫై రూటర్లలో యాంటెన్నాలు అంతర్గతంగా ఉంటున్నాయి. వీటిలో ఎక్స్‌టర్నల్ యాంటెన్నాలను సపోర్ట్ చేసేవి కూడా ఉన్నాయి. ఇలాంటి రూటర్ ఉన్నట్టయితే పొడవైన యాంటెన్నాను తెప్పించుకుని అనుసంధానించుకోవడం వల్ల వైఫై వేగం పెరుగుతుంది. 
 
బ్లూటూత్ కూడా వైఫై తరంగాలకు విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే బ్లూటూత్ కూడా 2.4 గిగాహెడ్జ్ స్థాయిలోనే పనిచేస్తుంది. దీంతో తరంగాల వ్యాప్తి సమయంలో క్లాష్ అవకుండా ఉండేందుకు బ్లూటూత్ పరికరాలను వైపై రూటర్‌కు దూరంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి చిన్నపాటి సమస్యలను అధికమిస్తే వైఫై స్పీడులో ఎలాంటి మార్పు లేకుండా ఈ సేవలను పొందవచ్చు.