శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:51 IST)

మీ పిల్లలు రోజూ వ్యాయామం చేస్తున్నారా?

మీ పిల్లలు ఎప్పుడూ చదువులతో కుస్తీ పడుతున్నారా? ఎంత చదివినా చదువులో బాగా రాణించలేకపోతున్నారా? ఎన్ని సౌకర్యాలను కల్పించినా పరీక్షల్లో సరైన ప్రతిభ కనబరచలేకున్నారా? అయితే ఆ సమస్యలన్నింటినీ అధిగమించడానికి ఈ మార్గాన్ని అనుసరిస్తే సరి..
 
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం సరైన సమయానికి పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. అందువల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇది కేవలం పెద్దలకు మాత్రమే కాదు, పిల్ల‌లు కూడా వ్యాయామం చేస్తే అనేక లాభాలు కలుగుతాయట‌. మరీ ముఖ్యంగా వారు చదువుల్లో బాగా రాణిస్తారట. 
 
సైంటిస్ట్‌లు చేపట్టిన తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు చెందిన కొందరు సైంటిస్ట్‌లు పిల్లలపై పరిశోధనలు నిర్వహించారు. నిత్యం వ్యాయామం చేసే పిల్లలు, వ్యాయామం చేయని పిల్లలకు సంబంధించి వారు చదువుల్లో ఎలా రాణిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. 
 
నిత్యం కనీసం 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే పిల్లలు చదువుల్లో కూడా బాగా రాణిస్తారని తెలుసుకున్నారు. అందువల్ల పిల్లల్ని రోజూ క‌నీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్స‌హించాల‌ని, లేదా కనీసం ఆటలు ఆడుకునేందుకు పెద్దలు అనుమతించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఫలితంగా పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారని వారు అంటున్నారు..!