శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 26 జూన్ 2014 (12:49 IST)

నాడు విద్యార్థుల ప్రేయసి.. నేడు వ్యర్థ పదార్థం!!

ఒకప్పుడు విద్యార్థులు అత్యంత ప్రేమగా చూసుకునే వస్తువు పెన్ను (కలం). అది నేడు పర్యావరణాన్ని కాలుష్యం చేసే ప్లాస్టిక్ వ్యర్థంగా మారిపోతుంది. కారణం కేవలం రెండు రూపాయల నుంచే నాణ్యమైన 'యూజ్ అండ్ త్రో' (వాడిపారేసే) పెన్నులు అందుబాటులో ఉండటమే. ఫలితంగా ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా పెరిగిపోయి పర్యావరణానికి చేటు వాటిల్లుతోంది.
 
1990లో దర్శనమిచ్చిన ఫౌంటెన్ పెన్ (సిరా పెన్నులు) క్రమక్రంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేదు. రీఫిల్ మార్చాల్సిన అవసరమూ లేదు. పాళీ అరిగిపోయినా లేదా విరిగిపోయినా కొత్త పాళీ వేసుకోవడం. పెన్‌లో సిరా అయిపోతే సిరాబుడ్డితో మళ్లీ నింపుకోవడం జరిగేది.
 
కానీ... నేటితరం పెన్‌లలో సిరా రీఫిల్ ఖాళీ అయితే దానిని మార్చుకునే సమయం కూడా విద్యార్థులకు ఉండటం లేదు. దీనికి మరో కారణం కూడా ఉంది. రీఫిల్ కొనాలంటే రూ. 4 వెచ్చించాలి, కానీ.. ఇక్కడ రూ. 5లకే కొత్త పెన్ లభిస్తుంది. రీఫిల్‌కు, పెన్‌కు తేడా ఒక్క రూపాయే కదా, పైపెచ్చు కొత్త పెన్ వాడినట్లు ఉంటుందని విద్యార్థులు కొత్తవాటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో పాత పెన్‌లను చెత్తబుట్టలకు అంకితమిస్తున్నారు.
 
మనదేశంలో 80 శాతం మంది వినియోగదారులు రూ. 10 లోపు ధర కలిగిన పెన్‌లను ఉపయోగిస్తున్నారని లింక్ పెన్, ప్లాస్టిక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జలాన్ అన్నారు. రాత పరికరాల పరిశ్రమలో టాప్ 3 సంస్థలలో ఒకటిగా ఉన్న లింక్ కంపెనీ 100 పెన్‌లకు గానూ కేవలం 30 రీఫిళ్లను మాత్రమే విక్రయిస్తుంది. అంటే ప్రతి 100 పెన్‌లలో 70 పెన్‌లు ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారుతున్నాయి. కాబట్టి విద్యార్థులారా..! పెన్ పారేసేటప్పుడు ఒక్కసారి మన పర్యావరణాన్ని గురించి కూడా ఆలోచించండి.