శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 28 మే 2015 (16:44 IST)

పిల్లలకు బిస్కెట్స్ పెట్టొచ్చా?: టిఫిన్‌కు బదులు బిస్కెట్స్, టీ తీసుకుంటే?

బిస్కెట్లను పిల్లలూ, పెద్దలూ ఆకలేస్తే రెండు తినేస్తుంటారు. బిస్కెట్స్ తీసుకోవడం ద్వారా ఆకలి తీర్చడం వరకే చేస్తుంది. కానీ బిస్కెట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు అంటున్నారు. బిస్కెట్లలో పంచదార, కొవ్వు, ఆమ్లాలు అధికంగా ఉంటాయి. బిస్కెట్ల తయారీలో ఓవర్ హీట్ అవుతున్న ఆయిల్స్, డాల్డాల నుంచి ఆమ్లాలు పుట్టుకొస్తాయి. ఈ ఆమ్లాలు ఆరోగ్యానికి కీడును కలిగిస్తాయి. ఈ ఆమ్లాలు శరీరంలో అధికంగా చేరితో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక షుగర్ గురించి, ఫాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
బిస్కెట్లు చెడిపోకుండా ఉండేందుకు అధికంగా ఉప్పును ఉపయోగిస్తున్నారు. అధిక రక్తపోటు గలవారు ఇలాంటి బిస్కెట్లను తింటే అనవసరపు అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిస్కెట్లలో నిషేధిత E223 అనే రసాయనాలు, గోధుమల్లోని గ్లూటెన్ అనే ఫైబర్ కొందరి ఆరోగ్యానికి పడవు. అందుచేత వాంతులు, ఛాతిలో మంట వంటివి తప్పవు. మైదా బిస్కెట్లను కూడా చాలామటుకు తీసుకోవడం తగ్గించాలి.  
 
కొంతమంది బరువు తగ్గుతామని బిస్కెట్లు తింటుంటారు. అయితే బిస్కెట్లను మాత్రమే తినడం ద్వారా శరీరానికి అందాల్సిన శక్తి లభించట్లేదు. దీంతో అనారోగ్య సమస్యలే వేధిస్తాయి. మార్నింగ్ టిఫిన్ తినేందుకు టైమ్ లేకపోతే టీతో పాటు రెండు బిస్కెట్లు మాత్రమే తింటే సరిపోతుందనుకుంటారు. అయితే మార్నింగ్ టిఫిన్‌గా బిస్కెట్లు తినడం భవిష్యత్తులో ఆరోగ్యానికి లభించే శక్తిని తగ్గించేస్తుంది. అంతేకాదు.. ఉదర సమస్యలను ఏర్పరుస్తుంది.  
 
ముఖ్యంగా పిల్లలకు బిస్కెట్లను అలవాటు చేయడం అంత మంచిది కాదు. పిల్లలకు బిస్కెట్లంటే ఇష్టం కాబట్టి నాలుగైదైనా లాగించేస్తారు. తద్వారా కడుపు నిండిపోవడంతో ఆహారంపై మక్కువ చూపరు. బిస్కెట్స్ టేస్ట్ తెలుసుకుంటే పిల్లలు కారం, పులుపు వంటి ఇతరత్రా రుచులను ఇష్టపడరు.

కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు వంటివి పిల్లలకు స్నాక్స్‌గా ఇవ్వడం అలవాటు చేయాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్‌లను పక్కన పెట్టాలి. బిస్కెట్లు తిన్నాక పిల్లల నోటిని పుక్కిలించాలి. దీంతో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. పిల్లల్లో బిస్కెట్లు అజీర్తిని ఏర్పరుస్తాయి. తద్వారా మలబద్ధకం తప్పదు. అందుచేత వైద్యుల సలహా మేరకే పిల్లలకు బిస్కెట్లు ఇవ్వాలి. బిస్కెట్లు ఇవ్వడం కంటే పాలు, ఆకుకూరలు, రాగి, తృణధాన్యాల ద్వారా క్యాల్షియం లభిస్తుంది. ఎముకల పెరుగుదలకు క్యాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
బిస్కెట్లు వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవచ్చు. అయితే టిఫిన్‌కి బదులుగా ఇవ్వడం కూడదు. బిస్కెట్లకు బదులుగా పండ్లు, శెనగలు, ఓట్స్ వంటివి ఇవొచ్చు. పీచు, చిరుధాన్యాలు, జీడిపప్పు వంటివి నేరుగానే తీసుకోవడం మంచిది. వీటిని బిస్కెట్ల రూపంలో తీసుకోవడం అంత మంచిది కాదు. బిస్కెట్లు తెగ లాగించకుండా ఫ్రూట్ సలాడ్, వేరుశెనగలు, బఠాణీలు, బాదం, బేరికాయ, ఎండుద్రాక్షలు వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.