గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By chj
Last Modified: బుధవారం, 10 ఆగస్టు 2016 (17:31 IST)

పుష్కరాల్లో హంసలదీవి వద్ద కృష్ణమ్మలో స్నానం చేసిన గంగ

కృష్ణా పుష్కర సమయంలో సాక్షాత్తూ గంగానదే సహ్య పర్వత శ్రేణుల్లో కృష్ణ పుట్టిన చోటుకు వస్తుందని ఒక ఐతిహ్యం. పాపాత్ముల పాపం పోగొట్టుకొనుటకై గంగానది తన సోదరిని చూడటానికి వచ్చినట్లుగా వచ్చి బృహస్పతి కన్యారాశిలో ఉన్నంతవరకు పరమ నియమముతో కృష్ణమ్మ దగ్గరే ఉండిప

కృష్ణా పుష్కర సమయంలో సాక్షాత్తూ గంగానదే సహ్య పర్వత శ్రేణుల్లో కృష్ణ పుట్టిన చోటుకు వస్తుందని ఒక ఐతిహ్యం. పాపాత్ముల పాపం పోగొట్టుకొనుటకై గంగానది తన సోదరిని చూడటానికి వచ్చినట్లుగా వచ్చి బృహస్పతి కన్యారాశిలో ఉన్నంతవరకు పరమ నియమముతో కృష్ణమ్మ దగ్గరే ఉండిపోతుందట. ఇప్పటికీ సహ్య పర్వతం మీద కృష్ణా పుష్కర సంవత్సర కాలమంతా ఒక కుండ యందు గంగ ప్రవహిస్తుందని ఈ శ్లోకం చెబుతుంది. పుష్కర సంవత్సరం దాటితే గంగ మరల కనిపించదు.
 
“గతే జీవే కన్యాంజగతి బహూమాన్యాం శిఖరిణీ
హసహ్యే త్వాం ధన్యాం జనని భగినీ వామర సరిత్
సమాగత్యాప్యబ్దం పరమ నియమాత్ తిష్టతి ముదా
నమః శ్రీకృష్ణే తే జయ శమిత తృష్టే గురుమతే”
 
దీనికి సంబంధించి స్కంద పురాణంలో మహర్షుల కోర్కెపై కుమారస్వామి చెప్పిన కథ యిది. పూర్వం దివోదాసుడనే రాజు కాశీ పట్టణాన్ని పరిపాలించేవాడు. ఒకానొక సమయంలో హైహయరాజు అతని రాజ్యాన్ని అపహరించాడు. ఆ కారణంగా దేవతలు, ఋషులు కాశీ వదిలిపెట్టి తీర్ధయాత్రకై దక్షిణదిక్కుకు వెళ్ళారు. ఆ యాత్రలో భాగంగా సహ్య పర్వతానికి వచ్చారు. 
 
అక్కడ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో ప్రవహిస్తున్న కృష్ణానది చెంతకు చేరినపుడు వారు తమ అలసటను పోగొట్టుకొని, చాలా ఆనందించారు. అక్కడే తపస్సు చేసుకోవాలనే అభిలాషతో తపస్సును ఆరంభించారు. వారి తపస్సు అక్కడ నిరాటంకంగా కొనసాగుతుండగా కొన్నాళ్ళకు శ్రీమన్నారాయణుడు వారికి ప్రత్యక్షమైనాడు. ఏదైనా వరం కోరుకోమన్న భగవానుని మహర్షులు ఈవిధంగా ప్రార్థించారు. 
 
నీ చరణ కమలము నందు ఉద్భవించిన గంగ ఇక్కడ కృష్ణానదిలో కలిసి సర్వజీవులను ఉద్ధరించేలా వరం ఇవ్వమని అడిగారు. దాని ఫలితంగానే కృష్ణా పుష్కర సమయంలో గంగ ఇక్కడికి విచ్చేస్తుంది. గంగలో కంటే కూడా కృష్ణానదిలో స్నానం చేస్తే తొందరగాను, ఎక్కువగాను పాపాలు పోతాయని పురాణాల్లో ఒక కథ ఉంది. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయని హిందువుల విశ్వాసం. 
 
స్నానాలు చేసే సమస్త జనుల పాపములనూ స్వీకరించడం వల్ల గంగానది నల్లబడిపోయిందట. నువ్వెళ్ళి కృష్ణలో స్నానం చెయ్యి, నలుపు పోతుందని ఋషులు గంగకు చెప్పారట. గంగానది వచ్చి కృష్ణలో స్నానం చేసింది. కాకి రూపంలో వచ్చిన గంగ హంసలా మారిపోయింది. అందుకే ఆ ప్రదేశానికి ‘హంసలదీవి’ అనే పేరు వచ్చింది.