శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (10:36 IST)

ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ : అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఓటరు తీర్పు?

ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్... ఈ నినాదం దేశ ఓటర్లను తీవ్ర ప్రభావితం చేసినట్టుగా ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోమారు అధికారాన్ని కట్టబెట్టాలన్న ఓటర్లు భావించినట్టు ఉన్నారు. ఆదివారం సాయంత్రంతో ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఫలితాల తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఫలితాల్లో ప్రతి సంస్థా బీజీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే మెజార్టీని కట్టబెట్టాయి. 
 
అంటే.. గత ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన సీట్లను మళ్లీ సొంతం చేసుకోవడమేకాకుండా, అనేక రాష్ట్రాల్లో తన పట్టును నిలుపుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, వెస్ట్ బెంగాల్ వంటి కొత్త రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేసినట్టు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో బీజేపీ భారీగా లాభపడనుందని ఎగ్గిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
 
బెంగాల్లో 42 లోక్‌సభ సీట్లు ఉండగా.. వీటిలో టుడేస్‌ చాణక్య అయితే ఏకంగా బీజేపీ 18 (8 సీట్లకు అటు ఇటు) స్థానాలు సాధిస్తుందని అంచనా వేసేసింది. సీ ఓటర్‌ కూడా 11-16 సీట్లు వస్తాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు రెండు మాత్రమే. దీనితో పోలిస్తే అక్కడ బీజేపీ గణనీయంగా పుంజుకుందని ఈ సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. 
 
అదేవిధంగా గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు సాధించిన ఒడిసాలో బీజేపీ ఈసారి 9 సీట్లు సాధించే అవకాశం ఉందని ఏబీపీ-నీల్సన్‌ తెలిపింది. ఇక, ఈసారి ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతినే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ అని ఇప్పటి వరకూ రాజకీయ వర్గాల అంచనా. ఇందుకు కారణం అక్కడ ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి కట్టడమే. కానీ ఇక్కడ కూడా బీజేపీకి అనుకూల పవనాలు వీసినట్టు పేర్కొన్నాయి.
 
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-అప్నాదళ్‌ కలిసి ఇక్కడ 73 సీట్లు సాధించాయి. ఈసారి ఆ కూటమి కేవలం 22 సీట్లనే సాధిస్తుందని ఏపీబీ-నీల్సన్‌ అంచనా వేస్తే.. 60 స్థానాలు గ్యారెంటీ అని న్యూస్‌ 18-ఇప్సోస్, న్యూస్‌ 24 - చాణక్య వెల్లడించింది. సీ ఓటర్‌-రిపబ్లిక్‌ మాత్రం కూటమికి 40, బీజేపీకి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్‌కీ బాత్‌ మాత్రం ఎన్డీయేకి 46-57 సీట్లు, ఎస్పీ-బీఎస్పీ కూటమికి 15-29 స్థానాలు రావచ్చని తెలిపింది. 
 
మొత్తంమీద ఏడు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ సగటు చూస్తే.. ఇక్కడ బీజేపీ కూటమికి 45, ఎస్పీ-బీఎస్పీ కూటమికి 32 సీట్లు వస్తాయని అంచనా. మరోవైపు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీజేపీ బాగా పుంజుకున్నట్టు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి 13 మించి రావని ఎగ్జిట్‌ పోల్స్‌ సగటు అంచనాలో తేలింది. 
 
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోగా.. అక్కడి 11 లోక్‌సభ సీట్లలో ఈసారి ఆ పార్టీ ఏడు సాధిస్తుందని అంచనా వేశాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లోనూ అత్యధిక ఎంపీ సీట్లు కాషాయదళానికేనని చెప్పాయి. రాజస్థాన్‌లోని 25 సీట్లలో బీజేపీ 22-25 స్థానాల్లో, మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో కమలం 23-29 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేయడం గమనార్హం.