శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By chj
Last Modified: శనివారం, 5 మార్చి 2016 (12:55 IST)

మహాశివరాత్రి... శివాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలి? పూజా విధానం...

శివాలయంలో చేసే ప్రదక్షిణకు మిగిలిన దేవాలయాల్లో చేసే ప్రదక్షణలకు తేడా ఉంటుంది. శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 
 
శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం( శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. 
 
అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. ఈ విధమైన ప్రదక్షిణలు శివునికి భక్తులు బేసి సంఖ్యలో వచ్చే విధంగా 3,5,7,9 ప్రదక్షిణలు చేయవచ్చు. 
 
శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం.
 
ఇక మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.
 
ఇక ఉపవాసం సంగతికొస్తే.. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. ఇక జాగారం ఎలా చేయాలంటే..? శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. 
 
జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.
 
ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే...? లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి. 
 
జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు. 
 
ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.