పర్యాటకులకు ఆహ్లాదం పంచే "తలకోన" జలపాతం

Hanumantha Reddy|
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

తలకోన ప్రాంత విశేషాలు
ప్రసిద్ధ నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ తలకోన జలపాతం ఉండడం విశేషం. దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు మధ్యభాగంలో జలపాతం ఉండడం వల్ల ఇక్కడకు చేరుకునే పర్యాటకులకు అదోరకమైన చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే ఇక అక్కడి నుంచి కదిలిరావడానికి పర్యాటకులకు మనస్సు అంగీకరించదు.

తలకోన జలపాతాన్ని సందర్శించే ముందు ఆ ప్రాతంలో ఓ శివాలయం ఉన్నది. ఇక్కడ శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. స్వామివారితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులు తీసుకువెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆపై జలపాతం వద్దకు చేరుకోవాలంటే నడకబాట పట్టాల్సిందే.

కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ జాలువారే జలపాతాన్ని మనం సందర్శించవచ్చు. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాత దృశ్యం బహు అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి సమీపంలో కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై పర్యాటకులు నిలబడి జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలాంటి ప్రదేశంలోని నీటిలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

తలకోనలో వసతి సౌకర్యాలు
జలపాతానికి ముందుగా ఉన్న ఆలయం ప్రాతంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖచే నిర్మించబడిన ఓ అతిధి గృహం ఉంది. ఇది తప్ప ఇక్కడ చెప్పుకో దగ్గ సౌకర్యాలు లేదు. ఆలయానికి ముందు భాగంలో పూజా సాముగ్రి విక్రయించే చిన్న దుకాలు రెండో మూడో ఉన్నాయి. అలాగే ఆలయానికి పక్కగా ఓ చిన్న హోటల్ అందుబాటులో ఉంది.

తలకోనకు వెళ్లే చాలామంది పర్యాటకులు తినే పదార్ధాలను తమతోనే తీసుకువెళ్తారు. తినే పదార్ధాలు ఏమీ తీసుకుని వెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్‌లో ముందుగానే చెబితే భోజనాన్ని సమకూరుస్తారు. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడివద్దకు చేరుకుంటారు.

అలాగే పర్యాటకుల్లో ఏ కొద్దిమందో తప్ప మిగిలినవారు సాయంత్రానికి సమీపంలోని గ్రామానికి లేదా సొంత ప్రదేశానికి పయనమవుతారు.

రవాణా సౌకర్యాలు
తిరుపతి పట్టణం నుంచి తలకోన 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి యెర్రావారిపాళెం చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. యెర్రావారిపాళెం వరకు ఎళ్లప్పుడూ బస్సు సౌకర్యం ఉండగా అక్కడి నుంచి తలకోనకు చేరడానికి వ్యాన్, ఆటోల సౌకర్యం ఉంది. సినిమా షూటింగ్‌లకు తలకోన పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు ఏడాదిలో చాలారోజులు షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి.


దీనిపై మరింత చదవండి :