రాజ్యసభలో రభస : 12 మంది విపక్ష సభ్యుల సస్పెండ్
గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభలో దురుసుగాను, హింసాత్మకంగా ప్రవర్తించిన 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తాజా సమావేశాల్లో సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసేంత వరకు వారు సభలో ప్రవేశించడానికి వీల్లేదని ఆయన సోమవారం ఆదేశాలు జారీచేశారు.
దీంతో సభ నుంచి సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల్లో ఎలమరం కరీం (సీపీఎం), పూలో దేవి నేతమ్ (కాంగ్రెస్), చాయా వర్మ (కాంగ్రెస్), రిపున్ బోరా (కాంగ్రెస్), బినోయ్ విశ్వ (సీపీఐ), రాజమణి పటేల్ (కాంగ్రెస్), డోలాసేన్ (టీఎంసీ), శాంతి ఛైత్రి (టీఎంసీ), ప్రియాంక చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ (శివసేన), అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)లు ఉన్నారు.
కాగా, ఈ విపక్ష సభ్యుల సస్పెండ్‌పై రాజ్యసభ ఒక ప్రకటన జారీచేసింది. "రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు, అంటే ఆగస్టు 11వ తేదీన భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా దాడుల ద్వారా సభా కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తుంది. సభ, సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభా నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, వికృత, హింసాత్మక ప్రవర్తన, ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ మర్యాదను దిగజార్చడం వంటి వాటికి పాల్పడ్డారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.