గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (12:24 IST)

ఓర్ని వీడి సెల్ఫీ పిచ్చి పిచ్చుకలు తీసుకెళ్లా... మహిళా జడ్జితో సెల్ఫీ తీస్కోబోయి...

సెల్ఫీ పిచ్చి ఈమధ్య మరీ పిచ్చిలా ముదిరిపోతోంది. కదులుతున్న రైళ్లలో నుంచి, పర్వత శిఖరపు అంచుల నుంచి, రెండు ఎత్తైన భవనాల మధ్య ఉండే ఖాళీ కనబడేట్లుగా అంచుల్లో నిలబడి సెల్ఫీలు తీసుకోబోయే పలువురు యువకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు విడిచారు. ఇన్ని ఘటనలు చూసినా కుర్రకారులో మాత్రం సెల్ఫీ పిచ్చి వదలడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షార్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఏకంగా జిల్లా మహిళా జడ్జితోనే సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి బుక్కయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... చంద్రకళ యూపీలోని బులంద్షార్ జిల్లా మేజిస్ట్రేటుగా ఉన్నారు. ఈ క్రమంలో కమలాపూర్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల అహ్మద్ జడ్జి మాట్లాడుతున్న సమావేశానికి హాజరయ్యాడు. అక్కడికి వచ్చిన ఆ యువకుడు జడ్జితో సెల్ఫీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 
 
ఆమె మాట్లాడుతుండగానే పక్కగా వెళ్లి సెల్ఫీ కోసం సెల్ ఫోనును పదేపదే క్లిక్ క్లిక్‌మనిపించసాగాడు. జడ్జి వారించినా అతడు పట్టించుకోలేదు. సెల్ఫీ కోసం క్లిక్కులు చేస్తూనే ఉన్నాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం జరుగగా అతడిని అరెస్టు చేసి గురువారం నాడు బెయిల్ పైన విడుదల చేశారు.