శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PY REDDY
Last Modified: బుధవారం, 31 డిశెంబరు 2014 (15:14 IST)

మోడీ, బీజేపీ చరిత్రలో మరపురాని యేడాది..2014.. వచ్చే ఏడాది కలిసొచ్చేనా..?

2014 : ఇది భారతీయ జనతా పార్టీకీ, నరేంద్ర మోడీకి ఘన కీర్తిని తెచ్చి పెట్టిన ఏడాది. భారతీయ జనతా పార్టీ, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ వారి వారి చరిత్రలో ఈ యేడాదిని సువర్ణ అక్షరాలతో లిఖించుకోవల్సిన సంవత్సరం అనడంలో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత, నరేంద్ర మోడీ నాయకత్వం బిజేపీ కలిసొచ్చిన అంశాలు. ఈ రెండు అంశాల కారణంగానే భారతీయ జనతా పార్టీ సొంత బలంతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. ఆ పార్టీకి ఇదే పెద్ద చరిత్ర. 
 
అదే సమయంలో ఏడాది చివర్లో అపకీర్తి మరకలను కూడా అంటించుకొంది. రెండు వివాదాలు ఆ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి. వాటిలో హిందుత్వ ధోరణి, రెండోది ప్రేమ-జిహాదీ అనే రెండు అంశాలు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పెట్టే అంశాలే. ఇవి రెండూ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంలోని ప్రధానమైనవి అనడంలో అనుమానం లేదు. హిందుత్వ అనే పదం భారతీయ జనతా పార్టీకి ఎప్పటి నుంచో దగ్గరైన పదమే. కాని ఈ యేడాదిలో జరిగిన మత పున:మార్పిడి కార్యక్రమం ఆ పార్టీకి మచ్చ తెచ్చిపెడుతున్నాయి. ఇదిలాగే లౌకిక భారతావనిని ప్రపంచ దేశాలు ప్రశ్నించే పరిస్థితి ఎదుర్కోక తప్పదు.
 
64 యేళ్ళ నరేంద్ర మోడీ ఆరెస్సెస్ ప్రచారక్ గా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సఫలుడు  అనడానికి వెనుకాడాల్సిన పనిలేదు. ఒకప్పటి ఈ సామాన్య ప్రచారక్ లోక్ సభ ఎన్నికల తరువాత వివిధ రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయాల పరంపరను కొనసాగించారు. 1980 దశకంలో పురుడుపోసుకున్న భారతీయ జనతా పార్టీ ఒక్క కేంద్రంలోనే కాదు. మహరాష్ట్ర, హర్యానా, జార్ఖాండ్ విజయదుందుభి మోగించింది. 
 
ఎన్నడూ లేని విధంగా జమ్ము కాశ్మీర్ లో 25 శాసనసభా స్థానాలను గెలుచుకుని కీలక పాత్ర పోషించే స్థితిలో ఉంది. జమ్ము ప్రాంతంలో 23 శాతం ఓట్లతో అగ్ర స్థానంలో నిలచింది. కాశ్మీరానా తనను తాను ఆవిష్కరించుకుంది. గడిచిన రెండు పార్లమెంటు ఎన్నికల అనుభవం పార్టీని ఈ ఎన్నికలలో విజయపథాన నడిపించాయి. అలాంటి ఇలాంటి విజయం కాదు. ముప్పయేళ్ళ సంకీర్ణ రాజకీయాలకు చరమగీతం పాడుతూ, సంపూర్ణ మెజారిటీ కలిగిన ఏకైక పార్టీగా అవతరించడం విశేషం.
 
ఎన్నికలకు ఏడాది కిందట నరేంద్ర మోడీ ఎన్నికల రథ సారధిగా ఎంపికైన సందర్భంగా చాలా విమర్శలే వచ్చాయి. ఆయనలోని కఠిన స్వభావం వలన పార్టీకి నష్టం వాటిల్లుతుందని వాదించిన వారు కూడా ఉన్నారు. కాని పరిస్థితి మరోలా తయారైంది. నరేంద్ర మోడీ ఎన్నికల రథసారధిగా భారతీయ జనతా పార్టీని ఉరకలు పెట్టించాడు. ఎన్నికల ప్రచారాన్ని ఒంటి చేత్తో నడిపాడు. 282 స్థానాలలో విజయ దుందుభి మోగించి ఇదీ తన సత్తా అని విమర్శకుల నోళ్లు మూయించాడు. 
 
ముప్పైళ్ళ చరిత్రలో పార్టీ ఏనాడు కనివిని ఎరుగనన్ని సీట్లను మూట కట్టి ఇచ్చాడు. ఈ ఎన్నికలలో 31.34 శాతం ఓటరులు బీజేపీకి మద్దతిచ్చారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ తప్ప మరే ఇతర పార్టీ కూడా ఇన్ని సీట్లను సాధించలేదు. పైగా 125 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చివరకు ప్రతిపక్ష స్థానానికి కూడా అర్హత సాధిస్తుందా..? అనే స్థాయికి దెబ్బ కొట్టగలిగాడు. నరేంద్ర మోడీ తెగింపు రాజకీయాలు ఎలా ఉంటాయంటే తమకు ఊపిరి అయిన శివసేనను కూడా పక్కపెట్టి మహరాష్ట్రలో శాసనసభ ఎన్నికలకు వెళ్లి భారతీయ జనతాపార్టీ సత్తాను చాటారు.
 
నిజంగా ఇది ఒక జూదంలాంటిదేనని చెప్పాలి. ఇక్కడ కూడా అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేనను కాదని ఎన్నికలు నడపడం కూడా నిజంగా చరిత్రేనని చెప్పాలి. అవే తరహా రాజకీయాలు హర్యానా, జార్ఖాండ్ లలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాయి. తన ఉనికే ప్రమాదకర పరిస్థితులలో ఉన్న చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ తానున్నానే గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఇందుకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాలే ఉదాహరణగా చెప్పవచ్చు. కాశ్మీర్ లోనైతే రెండో పెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఈశాన్య కోస్తా ప్రాంత రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడమే ఇందుకు కారణం అని చెప్పాలి. ఒడిస్సా, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాజ్ పేయ్, అద్వానీ ద్వయంతో పాటు మురళి మనోహర్ జోషిలను మోడీ మార్గదర్శక మండలిలో చేర్చి వారిని పక్కన పెట్టారు. తన ఆలోచనలకు అనుగుణంగా నడిచే వ్యక్తిగా అమిత్ షాను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి హర్యానా, మహరాష్ట్ర, జార్ఖాండ్ ఎన్నికలను విజయవంతంగా నడిపించారు. 
 
ఇంత వరకూ విజయాల పరంపరను కొనసాగించిన భారతీయ జనతాపార్టీ, మోడీలు నూతన సంవత్సరంలో ఢిల్లీ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది. ఆపై యేడు బిహార్ ఎన్నికలు తలపడాల్సి ఉంది. కాంగ్రెస్ ముక్త్ అనే నినాదంతో ముందుకు వెళ్లతున్న భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో పెద్ద ప్రణాళికలే రచిస్తోంది. అమిత్ షా ఆలోచనల ప్రకారం 10 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలనే యోచన ఉంది. 
 
ప్రస్తుతం 3.5 కోట్ల మంది ఉండగా, దీనిని రాబోవు సభ్యులలో ఎక్కువ శాతం యువశక్తితో నింపాలనే యోచన చేస్తున్నారు. మార్చి 2015 నాటికి దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో అమిత్ ఉన్నారు. ఆపై ప్రవాస భారతీయ సభ్యత్వాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తంపై ఇటు సంస్థాగతంగానూ, అటు బాహ్యంగాను పార్టీని పటిష్ట పరిచడంలో 2015 కలిసొస్తుందో లేదో వేచి చూడాల్సిందే.