శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (09:53 IST)

ముంబై నరమేధానికి తొమ్మిదేళ్లు... ఇంకా మానని గాయాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు మారణహోమం సాగించి నేటికి తొమ్మిదేళ్లు. పది మంది కరుడు గట్టిన ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు మారణహోమం సాగించి నేటికి తొమ్మిదేళ్లు. పది మంది కరుడు గట్టిన ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైన విషయం తెల్సిందే. మరో 300 మంది వరకు గాయపడ్డారు. 
 
అరేబియా మహాసముద్రం మీదుగా ముంబైలోకి చొచ్చుకొచ్చిన నర రూప రాక్షసులు వాణిజ్య రాజధానిని వాల్లకాడులా మార్చారు. లియోపోల్డ్ కేఫ్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, నారిమాన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, కామా ఆస్పత్రుల్లో మారణకాండ సృష్టించారు. 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌‌ను దాదాపు నాలుగేళ్ల పాటు విచారించి 2012 నవంబర్ 21న ఉరితీశారు. ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులక ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు అంజలి ఘటించారు. 
 
ముంబై నరమేధంలోని ముఖ్యమైన అంశాలు.. 
* 2008, నవంబర్ 26వ తేదీ సాయంత్రం అరేబియా మహాసముద్రం మీదుగా ముంబై కొలాబా తీరంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు.
* ఉగ్రవాదులు మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు.
* ఉగ్రవాదులు అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు, అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు, నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు వెళ్లి నరమేధం సాగించారు. 
* స్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు.
* ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో నరమేధం సృష్టించారు.
* ఉగ్రవాదుల కాల్పుల్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సహా పలువురు పోలీసులు, పౌరులు మృతి చెందారు.
* 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత భద్రతా బలగాల చేతిలో తొమ్మిది మంది ఉగ్రవాదుల హతమయ్యారు.
* 2008 నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద అజ్మల్ కసబ్‌ను అధికారులు అరెస్టు చేశారు.
* ముంబై ముట్టడికి బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ లు రాజీనామా చేశారు.
* నాలుగేళ్ల న్యాయ విచారణ అనంతరం 2012 నవంబర్ 21న పూణెలోని ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్‌కు ఉరితీశారు.