మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (10:29 IST)

ఇళ్ళు కేటాయించినా... స్టార్ హోటల్స్‌లో నివశిస్తున్న బీజేపీ ఎంపీలు.. బిల్లు రూ.కోట్లలో...

ప్రజల సొమ్మును దుబారా చేయడంలో మన ఎంపీలు సిద్ధహస్తులు. దేశ పరిపాలనా కేంద్రమైన ఢిల్లీలో వారికి ప్రత్యేకమైన ఇళ్ళు కేటాయించినప్పటికీ.. ఎంపీలు లేదా కేంద్ర మంత్రులు స్టార్స్ హోటల్స్‌లలో బస చేస్తున్నారు. ఫలితంగా వారి బిల్లులు తడిసిమోపడువుతున్నాయి. తాజాగా ఓ ఆంగ్లపత్రిక ప్రచురించిన కథనం మేరకు.. ప్రస్తుత ఎన్డీయే సర్కారుకు చెందిన పలువురు మంత్రులు, భాగస్వామ్య ఎంపీలు స్టార్ హోటల్స్‌లో నివశించడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన బిల్లు రూ.5.69 కోట్లు. ఇది లోక్‌సభ సెక్రటేరియట్‌కు వచ్చింది. ప్రస్తుతం ఈ బిల్లును చెల్లించేందుకు లోక్‌సభ సెక్రటేరియట్ నిరాకరిస్తోంది. 
 
పార్లమెంట్ సమావేశాల సమయాల్లోనూ లేదా వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చినపుడు ఎంపీలు నివశించేందుకు వీలుగా రాజధాని నగరంలో నివాస సదుపాయం కల్పించింది. అయితే, అనేక మంది ఎంపీలు వాటిలో ఉండకుండా ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ హోటళ్లలో దిగుతూ ఖజానాపై భారం వేస్తున్నారు. పైగా అవసరమున్నంత మేరకుకాకుండా వ్యవధిని మించి హోటళ్లలో బస చేస్తూ ప్రభుత్వ సొమ్మును దర్జాగా దుబారా చేస్తున్నారు. 
 
తాజాగా 27 మంది సిట్టింగ్ లోక్‌సభ సభ్యులు ఢిల్లీలోని అశోకా హోటల్‌లో వ్యవధిని మించి బసచేశారు. వీరిబిల్లు రూ.5.69 కోట్లు. ఈ ఎంపీల జాబితాలో బీజేపీ మిత్రపక్షమైన లోక్‌జనశక్తి పార్టీ ఎంపీ రామాకిశోర్‌సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన హోటల్ బిల్లు రూ.10.34 లక్షలు. ఆ తర్వాత స్థానంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌జీ కల్యాణ్‌జీ భాయ్ ఉన్నారు. ఈయన బిల్లు రూ.5.76 లక్షలుగా ఉంది. 
 
మూడోస్థానంలో రూ.4.57 లక్షల బిల్లు బకాయిలతో మరో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో ఉన్నారు. నాలుగో స్థానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి రూ.3.74 లక్షలతో వీకే సింగ్ ఉన్నారు. ఈ ఎంపీల బిల్లు బకాయిలను చెల్లించేది లేదని లోక్‌సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది.