గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (13:52 IST)

2జీ స్పెక్ట్రమ్ కేసులో దయాళు అమ్మాళ్‌కు బెయిల్!

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ బెయిల్ మంజూరైంది. ఢిల్లీ పటియాలా కోర్టు ఆమెకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక జడ్జి ఓ.పీ. షైనీ ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. రూ.5 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు.. ఇద్దరి పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించింది. 85 యేళ్ళ దయాళు అమ్మాళ్ ప్రస్తుతం అల్జీమర్స్, అమ్నీసియా వ్యాధులతో బాధపడుతున్నారు. 
 
రెండు రోజుల్లో బెయిల్ బాండ్ పనులు పూర్తి చేయాలని కోర్టు ఈ సందర్భంగా దయాల్ అమ్మళ్కు సూచించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో తొమ్మిది మంది బెయిల్‌ పిటిషన్లపై మాత్రం తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. 
 
కేంద్ర మాజీ టెలికాం మంత్రి,  డీఎంకే నేత రాజా డీబీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు అక్రమంగా స్పెక్ట్రమ్ లైసెన్స్‌లు కేటాయించినందుకుగాను.... డీఎంకే పార్టీకి చెందిన కలైంజ్ఞర్‌ టీవీకి రూ.200 కోట్లు పెట్టుబడుల రూపంలో ముట్టాయని ఈడీ ఆరోపణ. ఈ కేసులో మొత్తం 19 మందిని దోషులుగా పేర్కొంటూ ఈడీ కోర్టుకు చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.