బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2015 (17:09 IST)

సుందర్ పిచ్చై 'శ్రీమంతుడి' డైలాగ్... భారత సాంకేతికగతిని మార్చనున్న గూగుల్ ఎలా?

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తీసుకుంటున్న నిర్ణయంతో భారత సాంకేతికగతి పూర్తిగా మారిపోనుంది. ఆ సంస్థ అధిపతి, భారత పౌరుడు సుందర్ పిచ్చై పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన బుధవారం ప్రసారమాధ్యమాల ప్రతినిధులు, డెవలపర్లు, ఔత్సాహికులు, మార్కెటింగ్ నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత సాంకేతికగతిని మార్చేలా గూగుల్ తీసుకున్న 9 నిర్ణయాల గురించి వెల్లడించారు. అవి ఏంటంటే... 
 
భారత్‌లో గూగుల్ సేవలను రెట్టింపు చేసేందుకు వీలుగా దక్షిణాది నగరం హైదరాబాద్‌లో అతిపెద్ద ఇంజనీరింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, వచ్చే మూడేళ్లలో 3 లక్షల గ్రామాలకు చెందిన మహిళలకు ఇంటర్నెట్‌ను దగ్గర చేస్తామన్నారు. ఇందుకోసం ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని, దానికి 'ఇంటర్నెట్ సాథీ' అని పేరు పెట్టనున్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే 11 భారతీయ భాషల్లో టైపింగ్‌ను మరింత సులభతరం చేసేలా 'ఇండిక్' కీబోర్డు విడుదల చేయనున్నామన్నారు. 2017 నాటికి 500 రైల్వే స్టేషన్లలో వైఫై సెంటర్లు ఏర్పాటు చేస్తామని, డిసెంబర్ 2016 నాటికి 100 స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ సెర్చ్‌లో భారత్‌ క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రియమైన క్రికెట్ లైవ్ అప్ డేట్స్ అందిస్తామన్నారు.
 
వచ్చే సంవత్సరం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న అమెరికన్ల కన్నా భారతీయుల సంఖ్య పెరగనుంది. ఇది ఇండియాను గూగుల్‌కు హోం మార్కెట్‌గా మారుస్తుందని తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రకటించిన ప్రాజెక్ట్ లూన్‌ను ఇండియాకు తీసుకువచ్చి.. అతి తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీం అందిస్తామని తెలిపారు. ప్రతి భారతీయుడి తొలి అడుగు 'ఇంటర్నెట్ యాక్సెస్' అయ్యేలా చూస్తాం. "ఈ దేశం నాకెంతో ఇచ్చింది. అందుకు ప్రతిగా గూగుల్ తరఫున నేను కూడా ఈ దేశానికి ఎంతో కొంత ఇస్తాననే అనుకుంటున్నా" అంటూ సుందర్ పిచ్చై తన ప్రసంగాన్ని ముగించారు.