గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (08:20 IST)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. ఆలయ ప్రవేశానికి వచ్చాడనీ దళితుడి సజీవ దహనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకుఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. మహిళలపై అకృత్యాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రంగా పేరొందిన యూపీలో తాజాగా మరో దారుణం జరిగింది. ఆలయ ప్రవేశం చేసేందుకు యత్నించాడన్న కోపంతో ఓ దళితుడిని ఓ రౌడీ షీటర్ సజీవ దహనం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని హమీర్‌పుర్‌ జిల్లాకు చెందిన 90 ఏళ్ల ఖిమ్మా అహిర్వార్‌ అనే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందిన వృద్ధుడు. ప్రస్తుతం దక్షిణాయన పుణ్యకాలం కావడంతో తన పితృదేవతలకు పిండ ప్రదానం చేసి, స్వగ్రామం దిల్గావ్‌లోని ఖిమ్మా ప్రాంతంలో ఉన్న మైదానీ బాబా (శివాలయం) ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు.  
 
ఆ సమయంలో ఆలయం వద్ద ఉన్న సంజయ్ శర్మ అనే అగ్రకులస్థుడు అహిర్వార్‌ను అడ్డు చెప్పాడు. నువ్వు దళితుడివి.. ఆలయంలోకి ఎలా వెళ్తావ్‌? అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న గొడ్డలితో ఖిమ్మాపై దాడి చేశాడు. దీంతో ఖిమ్మా.. కింద పడిపోవడంతో మరింత రెచ్చిపోయిన శర్మ.. గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. 
 
ఈ హఠాత్పరిణామంతో ఖిన్నులైన ఖిమ్మా కుటుంబ సభ్యులు హాహాకారాలు పెట్టుకుంటూ పరుగులు తీశారు. మరోపక్క, కింద పడిపోయిన ఖిమ్మాను ఆలయంలో ఓ మూల ఉన్న కట్టెల దగ్గరకు ఈడ్చుకొచ్చిన శర్మ.. ఖిమ్మాపై వాటిని పేర్చి నిప్పంటించాడు. ఖిమ్మా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకునేలోగానే ఘాతుకం జరిగిపోయింది. ఈ పరిణామంతో ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు శర్మను బంధించి చితకబాది, పోలీసులకు అప్పగించారు. శర్మపై ఇప్పటికే రౌడీషీట్ ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు.