శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (12:24 IST)

ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ

వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో లబ్దిదారులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయబోమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అనేక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ కార్డును తప్పని చేస్తున్న విషయంతెల్సిందే. 
 
ముఖ్యంగా ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయబోమని, ఆధార్‌ కార్డు లేనంత మాత్రాన ఎవరూ ప్రభుత్వ పథకాలకు అనర్హులుకారని ప్రభుత్వం గతంలో చెప్పిందని, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆర్బీఐ, ఎన్నికల సంఘంపై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలంటూ కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. 
 
ఈ పిటీషన్‌లపై జస్టీస్ చలమేశ్వర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ హాజరై.. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కోర్టుకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రాలతోపాటు సంబంధిత అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డామన్న వాదనను తిరస్కరించిన కేంద్రం.. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.