బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 నవంబరు 2015 (11:15 IST)

అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలు... స్నాప్ డీల్ అన్ ఇన్‌స్టాల్ చేసిన లక్ష మంది...?

అమీర్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడప్పుడే చల్లారేట్లు లేవు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఈ ఇద్దరు తప్పించి మిగిలిన వారంతా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తమ అసంతృప్తిని తీవ్రస్థాయిలోనే వెళ్లబుచ్చుతున్నారు. నాయకులు, సెలబ్రిటీలు సంగతేమోగానీ సామాన్య ప్రజానీకం మాత్రం ఉవ్వెత్తున తమ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో చూపిస్తున్నారు.
 
దేశంలో మత అసహనం పెరుగిపోతుందనీ, దీని కారణంగా తాము ఒక దశలో దేశం విడిచి వెళ్లిపోవాలని తన భార్య కిరణ్ రావ్ చెప్పిందంటూ అమీర్ ఖాన్ ఎలాంటి ఫీలింగుతో చెప్పారో తెలియదు కానీ జనం మాత్రం ఆయనకు షాకింగ్ ఇస్తున్నారు. అమీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే స్నాప్ డీల్ యాప్‌ను ఉన్నఫళంగా లక్ష మంది అన్ ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆ పని చేసినట్లు ఓ ట్వీట్ దర్శనమిస్తోంది. అధికారికంగా ఈ సంఖ్య ఎంత అనేది తెలియనప్పటికీ అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్న పలు ఉత్పత్తులకు పెద్ద దెబ్బే తగిలే అవకాశాలున్నట్లు చెపుతున్నారు.
 
ఇక అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై సామాన్యులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తమ వ్యాఖ్యల పరంపరను సాగిస్తున్నారు. వాటిలో కొన్ని ట్వీట్లు ఇలా ఉన్నాయి. నేను అమీర్ ఖాన్ కారణంగా స్నాప్ డీల్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేశా. ఇక నుంచి.. స్నాప్ డీల్ నుంచి ఇంకేం కొననని ఒకరు ట్వీట్ చేశారు. మరొకరైతే అమీర్ ఖాన్ లేకుండా దేశం బతకగలదు. బహుశా అతను లేకుండా భారత్ మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ భరతమాత లేకుండా, ఆమె ఆశీస్సులు లేకుండా మాత్రం అమీర్ మనుగడ సాధించలేడని పేర్కొన్నాడు. ఇంకొకరైతే... అమీర్ ఖాన్‌ను అసహనంతో ఉన్న పాకిస్థాన్ ఆహ్వానించినట్లుంది. హిందూస్థాన్‌ను విడిచి పెట్టటానికి ఇదే అతనికి సరైన సమయం అంటూ ట్వీటారు. ఇలా ఎన్నో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.