శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (14:49 IST)

అమ్మను ప‌రామ‌ర్శించిన త‌మిళ‌నాడు తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని.. అయితే ఇంకా మరికొన్ని రో

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని.. అయితే ఇంకా మరికొన్ని రోజులు మాత్రం ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను గత నెల రోజులుగా కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.
 
ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు శనివారం చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి మ‌రోమారు వెళ్లారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌య‌ల‌లిత‌ను ప‌రామ‌ర్శించారు. మరోపక్క జ‌య‌ల‌లిత మాట్లాడుతున్నార‌ని, ప్ర‌స్తుతం ఆమెకు కృత్రిమ శ్వాసతో పాటు, ఫిజియోథెరపీని కొనసాగిస్తున్నట్లు వైద్యులు బులిటెన్ కూడా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అమ్మ కూర్చున్నారని, మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి.

దాంతో కొన్నాళ్ల తర్వాత అయినా.. జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆనందంతో ఉన్నారు. గతనెల సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె క్షేమం కోరుతూ తమిళనాడు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేలాదిమంది అభిమానులు ఆస్పత్రి బయటే అమ్మ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు తమ పూజలు ఫలించాయని వాళ్లంతా సంబరపడిపోతున్నారు.