శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (18:57 IST)

వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.. షూ పాలిష్ కూడా? ఇప్పుడేమో సూసైడ్ చేసుకోమంటున్నారు: జవాను

ఆహారంలో నాణ్యత లోపించిందంటూ ఆరోపిస్తూ వీడియోను విడుదల చేసిన ఓ బీఎస్ఎఫ్‌ జవాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో అనంత‌రం సీఆర్‌పీఎఫ్‌ జవాను కూడా త‌మ బాధ‌ల‌ను తెలుపుతూ మ‌రో వీడియోను పోస్ట్ చేసిన సంగ‌

ఆహారంలో నాణ్యత లోపించిందంటూ ఆరోపిస్తూ వీడియోను విడుదల చేసిన ఓ బీఎస్ఎఫ్‌ జవాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో అనంత‌రం సీఆర్‌పీఎఫ్‌ జవాను కూడా త‌మ బాధ‌ల‌ను తెలుపుతూ మ‌రో వీడియోను పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇంటర్నెట్‌లో మ‌రో వీడియో ద‌ర్శ‌నం ఇచ్చింది. 
 
డెహ్రాడూన్‌లోని 42వ ఇన్‌ఫంట్రీ బ్రిగేడ్‌లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తోన్న యజ్ఙప్రతాప్‌ సింగ్ అనే సైనికుడు యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన‌ ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కిందిస్థాయి జవాన్లను కొంద‌రు అధికారులు ఉప‌యోగించుకుంటూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, త‌మ‌తో షూ పాలిష్ కూడా చేయించుకుంటున్నార‌ని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధానిల దృష్టికి తీసుకెళ్లానని, దీనిపై పీఎంవో వివరణ కూడా అడిగిందని తెలిపారు. తాను త‌మ స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు చేసే క్ర‌మంలో ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చారు. 
 
కానీ అధికారుల‌ను పీఎంవో రిపోర్టు అడిగిన‌ప్ప‌టినుంచి త‌న‌పై వేధింపులు అధిక‌మ‌య్యాయ‌ని తెలిపారు. త‌న‌ను ఆత్మహత్యకు ప్రేరేపించేలా అధికారులు దూషిస్తున్నారని.. అలా ఆత్మహత్య చేసుకోవడం ఆర్మీ నియమాలకు విరుద్ధమ‌ని, అందుకే తాను ఆ ప‌ని చేయడం లేదని చెప్పారు. ఈ విష‌యంపై స‌ర్కారు ఇప్ప‌టికైనా స్పందించాలని కోరారు. 
 
ఇదిలా ఉంటే.. ఆహారంలో నాణ్యత లేదంటూ ఆరోపిస్తూ వీడియోను అప్ లోడ్ చేసిన జవానుపై కూడా పై అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. సైనికులకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలు రక్షణ శాఖలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. దానిపై బీఎస్‌ఎఫ్‌ అధికారులు స్పందిస్తూ తేజ్‌ బహదూర్‌ను తప్పుబట్టారు. 
 
అతడి క్రమశిక్షణా రాహిత్యాన్నిగురించిన విషయాలు బహిర్గతం చేశారు. అతడు మద్యపానం చేస్తాడని, విధి నిర్వహణ సరిగా చేయడని ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను కొట్టిపడేస్తూ తేజ్‌ బహదూర్‌కి అండగా నిలిచింది ఆయన కుటుంబం. మంచి ఆహారం ఇవ్వమని కోరడం కూడా తప్పేనా అని తేజ్‌ భార్య షర్మిల ప్రశ్నించారు.

ఆయన మానసిక స్థితి సరిగా లేదంటున్నారు, అలాంటప్పుడు సరిహద్దులో విధినిర్వహణకు ఎలా పంపించారని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటివరకు తమ కుమారుడిని కూడా సైన్యంలోకే పంపాలనుకున్నామని, ఇప్పుడా ఆలోచన విరమించుకుంటున్నామని షర్మిల చెప్పారు.