మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:51 IST)

మహారాష్ట్ర విద్యామంత్రిపై అవినీతి మరక : టెండర్లు లేకుండానే కాంట్రాక్టు!

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో మరో మంత్రికి అవినీతి మరక అంటుకుంది. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న వినోద్ తావ్డే.... రూ.191 కోట్ల కాంట్రాక్టును ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే కట్టబెట్టారంటూ ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. 
 
ఇప్పటికే ఈ-టెండర్ల ప్రక్రియ నిబంధనల్ని అనుసరించకుండా మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజ ముండే ఒకేరోజు రూ.206 కోట్ల విలువైన పల్లిపట్టీ కొనుగోలుకు కాంట్రాక్టును అప్పగించిన వ్యవహారంలో ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  
 
ఇంకా పంకజ ముండే అవినీతి ఆరోపణల వివాదం సమసిపోకముందే విద్యాశాఖ మంత్రి తావ్డేపై అలాంటి ఆరోపణలే రావడం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ నెల 11న రాష్ట్రంలోని పాఠశాలలకు సరఫరా చేసేందుకు 62 వేలకు పైగా అగ్నిమాపక పరికరాల కొనుగోలు కోసం టెండర్లు పిలవకుండా కాంట్రాక్టును అప్పగించడంపై వివాదం రాజుకున్నది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని అధికారవర్గాలు వెల్లడించాయి. 
 
ఈ కాంట్రాక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కాంట్రాక్టర్లకు ఎలాంటి నగదు చెల్లింపులు జరపలేదని ఫడ్నవిస్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి సుధీర్ మంగ్తీవార్ మీడియాకు వివరించారు. పాఠశాలల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికే తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని మంత్రి తావ్డే వివరణ ఇచ్చారు. 
 
అలాగే, ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న శివసేన ఈ అంశంపై స్పందించి.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులను తక్షణం వారివారి బాధ్యతల నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేసింది.