మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (09:40 IST)

ఆ గుండె కోసం చెన్నైలో మళ్లీ ట్రాఫిక్ ఆగిపోయింది.....

చెన్నైలో ఒక గుండె కోసం ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఈ గుండె ఒక వ్యక్తికి పునర్జన్మనివ్వగా... ఆ మహిళ ఏకంగా ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపింది. చెన్నై నగర శివారు ప్రాంతమైన పాడికి చెందిన ఎల్. షీబా అనే మహిళ ఈనెల 27వ తేదీన విధులను ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తుండగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో అశోక్‌నగర్ పిల్లర్ వద్ద మరో బైక్‌ను ఢీకొంది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను రామాపురంలోని ఒక కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఆమె బ్రెయిన్‌డెడ్ అయి కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు ఆమె బంధువులకు వివరించారు. అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం షీబా అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ముగప్పేర్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు షీబా బంధువులను సంప్రదించి.. గుండెను దానం చేయాల్సిందిగా కోరారు. దీనికి రామాపురం ఆస్పత్రి వైద్యులతో పాటు.. షీబా బంధువులు కూడా సమ్మతించారు. అయితే, ఈ రెండు ఆస్పత్రుల మధ్య దూరం 14 కిలోమీటర్లు ఉంది. రామాపురంలో షీబా గుండెను తీసిన కొన్ని నిమిషాల్లో ముగప్పేర్‌లోని మరో ఆస్పత్రికి తరలించాల్సి వుంది. ఇందుకోసం అత్యంత బిజీగా ఉండే జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. 
 
ఇదే విషయంపై చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జి‌తో ఇరు ఆస్పత్రుల వైద్యులు సంప్రదింపులు జరిపారు. ఆయన ఆదేశంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు ఉన్నతాధికారులు దారిపొడవునా వంద మంది కానిస్టేబుళ్లను బందోబస్తు ఉంచారు. సోమవారం అర్థరాత్రి 12.50 గంటలకు రామాపురం ఆస్పత్రి నుంచి గుండెతో అంబులెన్స్ బయలుదేరి 14 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి కేవలం 8 నిమిషాల్లో అంటే 12.58 నిమిషాలకు చేర్చింది. 
 
ముగప్పేర్‌లో సిద్ధంగా ఉన్న వైద్యులు ఆగమేఘాలపై గుండెను మరో పేషెంట్‌కు అమర్చి అతనికి ప్రాణం పోశారు. షీబా నుంచి సేకరించిన కళ్లను శంకర్‌ నేత్రాలయ ద్వారా మరో ఇద్దరికి అమర్చారు. ఆమె రెండు కిడ్నీలను మరో ఇద్దరికి అమర్చారు, లివర్ మరొక రోగికి అమర్చి ఆమెను చిరంజీవిగా చేశారు. షీబా మరణించినా ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.