మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:09 IST)

తల్లిని కూర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి... కత్తితో పొడిచి చంపిన కుమారుడు

చెన్నైలో దారుణం జరిగింది. అధికార అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎంపీ భార్యను కన్నబిడ్డే చంపేశాడు. వృద్ధురాలైన తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి కత్తితో పొడిచి చంపేశాడు. హత్య తర్వాత కనిపించకుండా పోయాడు. నిందితుడు లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు కొన్నేళ్ళ క్రితం చనిపోయాడు. ఈయన స్థానిక చెన్నై బీసెంట్ నగర్‌లో నివశిస్తూ వచ్చాడు. కుళందైవేలు చనిపోయిన తర్వాత ఆ ఇంటిలో భార్య రత్నం (65) మాత్రమే నివశిస్తోంది. వీరికి ఒక కుమారుడు ప్రవీణ్ (35), కుమార్తె సుధ (37) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధ వైద్యురాలు కాగా, ఆమె భర్తతో కలిసి తిరునెల్వేలిలో నివశిస్తోంది. ప్రవీణ్ లండన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 
 
దీంతో బీసెంట్ నగర్‌లోని విశాలమైన ఇంటిలో రత్నం ఒక్కటే ఒంటరిగా నివశిస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం కుమారుడు ప్రవీణ్‌ ఒక యువతిని వెంటబెట్టుకుని చెన్నైలోని తల్లి వద్దకు వచ్చాడు. ఆ యువతి తన భార్య అని పరిచయం చేయడంతో తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. చెన్నైకి వచ్చినప్పటి నుంచి ఆస్తి పంపకాలు చేయాలని వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్‌చేసిన రత్నం.. ఆస్తిని పంచకుంటే హత్య చేస్తానని బెదిరించడమేగాక ప్రవీణ్‌ తనపై దాడిచేశాడని బోరున విలపిస్తూ చెప్పింది. 
 
దీంతో బీసెంట్‌నగర్‌లోని తన బంధువులకు సుధ ఫోన్‌చేసి ధైర్యం చెప్పాల్సిందిగా కోరింది. బంధువులు రత్నం ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా.. నోట్లో కాగితాలు కుక్కి, ప్లాస్టిక్‌ వైరుతో కాళ్లు చేతులూ కట్టేసి.. గొంతు, కడుపులో కత్తితో పొడవడంతో ప్రాణాలొదిలిన స్థితిలో రత్నం రక్తపు మడుగులో అచేతనంగా పడివుంది. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న ప్రవీణ్, అతనితో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లండన్‌లో ఉంటున్న ప్రవీణ్‌ అక్కడే ఒక యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నట్టు సమాచారం. అప్పులపాలు కావడంతో ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రవీణ్‌ విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లో అలర్ట్‌ ప్రకటించారు.