గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (17:23 IST)

శశికళకు ఓపీఎస్ స్ట్రోక్ : క్యాంపు పాలిటిక్స్... 130 మంది ఎమ్మెల్యేల కిడ్నాప్... ఫోన్లు స్వాధీనం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రూపంలో తేరుకోలేని షాక్ తగిలింది. దీంతో సొంత పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది ఎమ్మెల్యేలను ఆమె కిడ్నా

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రూపంలో తేరుకోలేని షాక్ తగిలింది. దీంతో సొంత పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది ఎమ్మెల్యేలను ఆమె కిడ్నాప్ (క్యాంపు రాజకీయాల పేరిట రహస్య ప్రాంతానికి తరలించడం) చేశారు. 
 
బుధవారం మధ్యాహ్నం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించిన శశికళ.. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలందరినీ రహస్య ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. దీంతో 130 మంది ఎమ్మెల్యేలను రెండు బస్సుల్లో చెన్నై ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ నక్షత్ర హోటల్‌కు తరలించారు. 
 
మరోవైపు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారంతా అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయనున్నారు. అదేసమయంలో సంపూర్ణ మజార్టీ ఉన్న శశికళను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని వారు కోరనున్నారు. 
 
ఇదిలావుండగా, పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అప్రమత్తమైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగంగా పావులు కదుపుతున్నారు. తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి నుంచి సంతకాలు సేకరించారు. ఆ తర్వాత వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. పన్నీర్ సెల్వం, డీఎంకే, బీజేపీ వంటి పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు నెలకొనకుండా ఆమె అనుచరులు ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, వారి నుంచి ఎలాంటి సమాచారం ఇతరులకు చేరకుండా చర్యలు చేపట్టారు. దీంతో తమిళనాట కలకలం రేగుతోంది. అధికారం కోసం శశికళ వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుగుబాటు ఎగురవేసిన ఓ.పన్నీర్ సెల్వంకు రాష్ట్ర యువత, ప్రజలు అండగా నిలుస్తున్నారు.