శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:33 IST)

శశికళ వర్గ ఎమ్మెల్యేల జాబితాలో పన్నీర్ పేరు.. సంతకం.. ఎమ్మెల్యేలు సంతకాలన్నీ ఫోర్జరీనా?

క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాల్లో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు గురువారం రాత్రి సమర్పించిన తనవర్గం ఎమ్మెల్యేల జాబితాలో ఆపద్ధర్మ

క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాల్లో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు గురువారం రాత్రి సమర్పించిన తనవర్గం ఎమ్మెల్యేల జాబితాలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం పేరు, సంతకం ఉందనే విషయం తెలిసింది. ఈ జాబితా చూసిన గవర్నర్ షాక్‌కు గురైనట్టు సమాచారం. పైగా, శశికళ సమర్పించిన లేఖలోని సంతకాలన్నీ నిజంగా ఎమ్మెల్యేలు చేశారా? లేక ఫోర్జరీ జరిగిందా? అన్న కోణంలో రాజ్‌భవన్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అసెంబ్లీ స్పీకర్, సీనియర్ అన్నాడీఎంకే నాయకుల సమక్షంలో దర్యాప్తు చేసేందుకు శశికళ కూడా అంగీకరించారని తెలియవచ్చింది. 
 
ఇదిలావుండగా, ఇన్ని రోజులు శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన, పార్టీ సీనియర్ నేత ఇ.మధుసూదనన్ గురువారం పన్నీర్ సెల్వం గూటికి చేరడంతో ఆయనపై చిన్నమ్మ కొరడా ఝుళిపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ హోదాలో మధుసూదనన్‌ను అన్నాడీఎంకే నుంచి తప్పించింది. ప్రిసీడియం ఛైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు అన్నాడీఎంకే శుక్రవారం ప్రకటించింది. మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్‌ను ప్రిసీడియం ఛైర్మన్‌గా నియమించినట్టు ప్రకటించారు 
 
శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన మధుసూదనన్ ఒక్కసారిగా అమ్మ విశ్వాసపాత్రుడు పన్నీర్ వర్గంలో చేరారు. శశికళ కుటుంబసభ్యులు పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
మరోవైపు ప్రిసీడియం ఛైర్మన్‌గా ఉన్న మధుసూదనన్... పన్నీర్ వర్గంలోకి వెళ్లడంతో ఓపీఎస్‌కు అనూహ్య మద్దతు పెరుగుతూ వస్తోంది. దీంతో మధుసూదనన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే పేర్కొంది. అయితే పార్టీ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టే వాళ్లు ఐదేళ్లు పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉండాలని, ఇలాంటివేమీ లేకుండానే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా చేపట్టారని, అందువల్ల ఆమె ఎన్నిక చెల్లదంటూ ఈసీ ఇప్పటికే షాకిచ్చింది. దీంతో ఆమె ఏ క్షణమైనా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.