శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (14:12 IST)

శశికళకు తేరుకోలేని షాక్... ఆ తీర్మానం చెల్లదు... ఈసీకి ప్రిసీడియం ఛైర్మన్ లేఖ...

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమెను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ చేసిన తీర్మానాన

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమెను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ చేసిన తీర్మానాన్ని తోసిపుచ్చవలసిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ లేఖ రాశారు. ఎన్నికల సంఘం కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే శశికళ అధ్యాయం ముగిసినట్లేనని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఆ పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మరణానంతరం డిసెంబరు 29న శశికళకు ఈ పదవిని తాత్కాలికంగా కట్టబెడుతూ ఆమెను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. నాటి సమావేశానికి మధుసూదనన్ ప్రిసీడియం ఛైర్మన్‌గా వ్యవహరించినందున ఆయనే ఇప్పుడు ఎన్నికల సంఘానికి అప్పటి తీర్మానం చెల్లదంటూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
మరోవైపు... శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న నేపథ్యంలో పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘం ఇటీవల నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానం ప్రతిని తమకు పంపాలని కోరింది. తాత్కాలిక హోదాలో ఉన్న శశికళకు పార్టీ నుంచి ఏ ఒక్కరినీ తొలగించే అధికారం లేదని ఆమె ద్వారా తొలగింపునకు గురైన నేతలు స్పష్టంచేస్తున్నారు. ఈ పరిణామాల నడుమ ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.