బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (08:56 IST)

జయలలితపై ఇంట్లోనే దాడి.. కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రిలో అడ్మిట్... నిజమా?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితపై ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో దాడి జరిగిందట. ఇది అక్షరాలా నిజమని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నయ

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితపై ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో దాడి జరిగిందట. ఇది అక్షరాలా నిజమని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నయ్యన్ అంటున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరటానికి ముందే పోయెస్‌ గార్డెన్‌లో జయలలితపై దాడి జరిగిందని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థితిలోనే ఆమెను ఆసుపత్రికి తరలించారని ఆయన ఆరోపించారు. 
 
జయలలిత మృతిలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయని, అపోలో ఆసుపత్రితో శశికళ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న వార్డులో ఎవరినీ అడుగు పెట్టనివ్వలేదని, లోపలకు వస్తే అంటువ్యాధులు సోకుతాయని పదే పదే బెదిరించారని చెప్పారు. 
 
అలాంటపుడు... 72 రోజుల పాటు జయలలిత పక్కనే ఉన్నట్టు చెబుతున్న శశికళకు అంటువ్యాధులు ఎందుకు సోకలేదో అర్థం కావటం లేదన్నారు. ఇక్కడే జయలలిత మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అమ్మ మృతిపై న్యాయ విచారణ జరిపిస్తేనే నిజాలు బహిర్గతమవుతాయని ఆయన డిమాండ్ చేశారు.