బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మార్చి 2016 (17:11 IST)

వయస్సు పెరిగిందనీ విధులు కేటాయించడం లేదు : ఎస్టీ కులానికి చెందిన ఎయిర్‌హోస్టెస్

ఎయిర్‌ హోస్టెస్ ఆవేదన

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో కూడా కుల వివక్ష బాగానే ఉన్నట్టు తాజాగా ఘటన ఒకటి రుజువు చేస్తోంది. వయస్సు పెరిగిందనీ, ఎస్టీ కులానికి చెందిన మహిళ అని ఓ ఎయిర్‌హోస్టెస్‍కు విధులు కేటాయించడం లేదు. ఇదే అంశంపై ఆ ఎయిర్‌హోస్టెస్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఎయిర్‌హోస్టెస్ పేరు బి.ఝాన్సీ రాణి. ఎయిర్ ఇండియా ఉద్యోగిని. ఈమె జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అందులో 'నేను షెడ్యూలు తెగకు చెందిన కోయ సామాజిక వర్గానికి చెందిన మహిళను. భద్రాచలం ఏజెన్సీ నుంచి వచ్చి ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివసిస్తున్నా. నేను ఎయిర్‌ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశా. దాదాపు 27 ఏళ్ల పాటు పనిచేసిన నాకు ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించడం మానేశారు. పైగా, 2008 నుంచి నాకు ఇప్పటివరకు వేతనం చెల్లించలేదు. వైద్య ప్రయోజనాలు కల్పించలేదు. ఇప్పటివరకు అటు పీఎఫ్ గానీ, గ్రాట్యుటీ చెల్లింపు విషయంగానీ తేల్చలేదు. 
 
నాపై ఇద్దరు కుమార్తెలు ఆధారపడివున్నారు. వాళ్ళ చదువుల కోసం డబ్బులు చెల్లించలేకపోతున్నా. ఇప్పటివరకు నా కుటుంబాన్ని పోషించుకునేందుకు నానాకష్టాలు పడ్డా. ఈ వయసులో నేను కొత్తగా ఉద్యోగాన్ని పొందలేక పోతున్నా. అందువల్ల నాకు రావాల్సిన వేతనం ఇప్పించాలని వేడుకుంటున్నా. నన్ను ఇన్నాళ్లు వేధించినందుకు నాకు పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నా. నా తోటి ఉద్యోగులకు ఇచ్చిన తరహాలో అన్ని రకాల పదోన్నతులతో సహా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నా. నాకు, నాకుటుంబానికి మనోవేదన కలిగించినందుకు రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని ప్రార్థిస్తున్నా' అని ఝాన్సీరాణి తన ఫిర్యాదులో పేర్కొంది.