మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (09:54 IST)

భళారే.. ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ రచ్చ : అపుడేం చేశారో...!

కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ (ఆర్ఎల్‌డి) అధ్యక్షుడు అజిత్ సింగ్ దేశ రాజధానిలో చేస్తున్న రభస అంతాఇంతా కాదు. ఇంతకు ఈయనగారు ఎందుకు రచ్చ చేస్తున్నారో తెలుసా.? గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహించినపుడు కేంద్రం ఓ బంగళాను కేటాయించింది. ప్రస్తుతం కూడా ఈయన అందులోనే నివాసముంటున్నారు. ఇపుడు దాన్ని ఖాళీ చేయమన్నందుకు ఆయన చేస్తున్న హంగామా... హడావిడి అంతాఇంతా కాదు. పైపెచ్చు.. తాను నివశిస్తున్న ఇంటిని తన తండ్రి పేరుమీద స్మారక మందిరంగా మార్చేందుకు తనకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు. 
 
వాస్తవానికి కొత్తగా ఎన్నికైన ఎంపీలకు నివాసాలు కేటాయించేందుకు వీలుగా మాజీ ఎంపీలు తమ ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయాలని ఎన్డీయే ప్రభుత్వం గత మూడు నెలలుగా కోరుతోంది. అయినా, ఏ ఒక్క మాజీ ఎంపీల దీనిపై స్పందన లేదు. ఈనెల 10న దాదాపు 120 మంది మాజీ ఎంపీల క్వార్టర్లకు కరెంట్, నీళ్ల సరఫరాను నిలిపివేసింది. వీళ్లలో రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షడు అజిత్ సింగ్ కూడా ఒకరు. 
 
అయితే, తనలాంటి సీనియర్ రాజకీయనాయకుడితో ఈ విధంగా ప్రవర్తించి అవమానిస్తారా? అని అజిత్ సింగ్ ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఆయనకు వచ్చిన కోపానికి ఫలితంగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కార్యకర్తలు 'రచ్చ రచ్చ' చేశారు. 
 
తమ నేతను అవమానించారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు విసరడంతో పాటు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ ఆందోళనలో ఇరవై మందికి తీవ్రగాయాలయ్యాయి. తమ నేత క్వార్టర్‌కు కరెంట్, వాటర్ సరఫరాను పునరుద్ధరించకపోతే... ఢిల్లీకి నీళ్లు సరఫరా చేసే పైప్‌ను బ్లాక్ చేస్తామని వారు హెచ్చరించారు. 
 
ఈ విషయంలో పలువురు కాంగ్రెస్ నేతలు అజిత్ సింగ్‌కు మద్దతు పలకడం గమనార్హం. వీరంతా ఈ కోవకే చెందిన వారే కదా.! అజిత్ సింగ్ వంటి సీనియర్ నేతకు కరెంట్, వాటర్ సరఫరాను బంద్ చేయడం ద్వారా ఎన్టీయే సర్కార్ చాలా అమర్యాదకరంగా ప్రవర్తించిందని హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఢిల్లీ వీధుల్లో అజిత్ సింగ్ కొంతమంది అనుచరులతో ఢిల్లీలో ధర్నాకు దిగడం కొసమెరుపు. పైపెచ్చు.. ఈయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తండ్రి స్మారక మందిరం గురించి ఆలోచన రాలేదు కావాలా?