శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (17:38 IST)

మహిళా ఉద్యోగినిని బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం.. అలయెన్స్ వర్శిటీ వైస్‌ఛాన్సలర్ అరెస్టు

బెంగుళూరులో ఓ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ అత్యాచారం కేసులో అరెస్టు చేశారు. ఒక మహిళా ఉద్యోగిని రెండేళ్ళుగా బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చిన కేసులో ఆయనను బెంగుళూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ ఉపకులపతి పేరు మధుకర్‌ జి.అంగూర్‌. అత్యాచారం కేసును ఎదుర్కొని ఏకంగా ఓ కులపతి అరెస్టు కావడం బెంగళూరులో సంచలనాత్మకమైంది. 
 
ఎంబీఏ పూర్తిచేసి అదే యూనివర్శిటీలో పనిచేస్తున్న 32 ఏళ్ళ ఉద్యోగిని బెదరించి రెండేళ్ళుగా అత్యాచారం చేశాడు. విషయాన్ని బహిరంగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అంతేకాక తను కోరుకున్నప్పుడల్లా తన కోరికను తీర్చాలని బెదిరించి... అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఎదురుతిరిగితే బతుకుదెరువు పోతుందేమోనని బాధితురాలు భయపడి విషయాన్ని బయటపెట్టలేక పోయింది. 
 
అయితే, ఆ కామాంధుడి అరాచకాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో వేధింపులు భరించలేక ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించడంతో అత్యాచారానికి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లి మడివాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మడివాళ పోలీసులు కేసు నమోదు చేసుకుని మధుకర్‌ జి.అంగూర్‌ను అరెస్టు చేసి విచారణలు జరిపారు. 
 
ఆ తర్వాత మధుకర్‌ అంగూర్‌ను మెజస్ట్రేట్ నివాసంలో హాజరుపరచగా 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని తాను ఏ పాపం ఎరుగనని కోర్టు వద్ద మధుకర్‌ వాపోయారు. భారీ బందోబస్తు నడుమ మధుకర్‌ను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు.