మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (10:51 IST)

జయలలితకు నిరాశ: బెయిల్‌ విచారణ 7కి వాయిదా!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం మరికొన్ని రోజులు ఆగకతప్పదు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణనును ఈ నెల 7కు వాయిదా వేసింది.
 
అంతకుముందు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. జయ తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. 
 
ఈ కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. జయ బెయిల్ దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సత్వర విచారణ కోరుతూ, జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదుల నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
 
మరోవైపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. జయకు బెయిల్ రావాలంటూ తమిళనాడు వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు.