గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (13:22 IST)

రాంపాల్ ఆశ్రమం బాత్‌రూంలో స్త్రీ... అపస్మారక స్థితిలో...

హర్యానాలో సంచలనం సృష్టిస్తూ ఓ హత్య కేసులో అరెస్టయిన వివాదాస్పద బాబా రాంపాల్‌కు చెందిన సత్ లోక్ ఆశ్రమంలో హర్యానా పోలీసులు శుక్రవారం నాడు భారీ మొత్తంలో ఆయుధ సామగ్రిని కనుగొన్నారు. ఈ సామగ్రిలో వివిధ రకాల తుపాకులు, తూటాలు, పెట్రోలు బాంబులు, యాసిడ్ సిరంజీలు, మిర్చి గ్రెనేడ్ వంటివి ఉండటాన్ని చూసి షాక్ తిన్నారు. 
 
ఆయుధ సామాగ్రిని రహస్య గదుల్లో దాచి పెట్టారు. కంచుకోటలా నిర్మించిన ఆశ్రమం మధ్యలో రాంపాల్ కూర్చునే పీఠం కింద ఈ ఆయుధాలను దాచి ఉంచారు. మరోవైపు తనిఖీల్లో రాంపాల్ గదిని ఆనుకొని ఉన్న ఓ గదిలో గర్భధారణ పరీక్ష చేపట్టిన పట్టీ ఒకటి కనబడింది. బాబా గదులకు ఆనుకుని ఉన్న ఓ గది ఉండగా అందులో తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిలో ఓ మహిళ అపస్మారక స్థితిలో కనిపించడం గమనార్హం. ఆమె మధ్యప్రదేశ్‌కు చెందిన బిజ్లేష్‌గా పోలీసులు గుర్తించారు.
 
మరోవైపు.. నెలల తరబడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బాబా రాంపాల్ గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ వింత వాదనను వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను పోలీసులకు సహకరించాలనే అనుకున్నా, తన సొంత కమెండోలు అందుకు అంగీకరించలేదని, తనను బయటకు రాకుండా బంధించారని ఆయన చెప్పారు.దీంతో న్యాయమూర్తి రాంపాల్ కొత్త వాదనపై విస్మయం వ్యక్తం చేశారు. 'మీ వాదన నమ్మశక్యంగా లేదే!' అంటూ రాంపాల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. అంతేకాక సదరు వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కేసులో తదుపరి విచారణను కొనసాగించారు.