గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: శనివారం, 31 జనవరి 2015 (07:43 IST)

‘అన్నా’ ఫోటోకు దండేసి... దండం పెట్టిన బీజేపీ.. వివాదస్పద కార్టూన్ విడుదల.

భారతీయ జనతా పార్టీ అన్నా హజారే ఫోటోకు దండేసి దండం పెట్టేసింది. అరెరె ఆయన ఇంకా బతికే ఉన్నారు కదా... ఆయన ఫోటోకు దండేయడం ఏంటీ అనుకుంటున్నారా... మీరు అనుకున్నది నిజమే.. దండేసిన దండం పెట్టిన మాట నిజమే.. ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది.? ఎక్కడ జరిగింది? వివరాలిలా ఉన్నాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. దేశానికి పాలక పక్షంగా ఉన్న బీజేపీ కూడా ఈ పాడు రాజకీయాలకు అతీతమేమి కాదు. ఏ మాత్రం విచక్షణ లేకుండా, పున:పరిశీలన లేకుండా ఓ సామాజిక కార్యకర్త ఫోటోకు దండేసి దండం పెట్టేశారు. తమ రాజకీయ ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ బీజేపీ విడుదల చేసిన కార్టూనులో అన్నాహజారేను చంపేశారు. 
 
ఆ చిత్రంలో అన్నా హజారే చిత్రపటానికి పూలమాల వేసినట్లు చూపటం ద్వారా ఆయన్ను బీజేపీ చంపేసింది. విమర్శించడానికి ఇంతకంటే నీచ మార్గామా అంటూ ఆప్ తో పాటు పలువురు విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. ‘నాడు గాంధీని గాడ్సే చంపేశాడు. ఇప్పుడు అన్నాని బీజేపీ తన ప్రకటనలో చంపేసింది’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఒక మనిషి బతికుండగానే కార్టూనైనా సరే ఇలా చిత్రీకరించే హక్కు ఎవరికీ లేదని విమర్శకులు బీజేపీ తీరును తప్పుబడుతున్నారు. విమర్శించడానికి ఎన్నో మార్గాలుండగా.. ఇలాంటి చిత్రాలను విడుదల చేయడం ఏంటని పెదవి విరుస్తున్నారు. మరి అన్నా హజారే దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.