బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (01:58 IST)

శశికళ చుట్టూ కమ్ముకుంటున్న మేఘాలు.. డీఎంకె మద్దతుతో గెలుపుబాటలో పన్నీర్ సెల్వం

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో నిర్ణాయక సమయం వచ్చేసింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరివైపుంటే వారికే ప్రభుత్వాధికారం దక్కే వీలు తథ్యమని తేలుతుండటంతో మిగతా అంశాలు పక్కన బెట్టి ఎమ్మెల్యేలు ఎవరివైపు ఎవరున్నారని తేలడమే తరువాయి ప్రభుత్వంపై పట్టు చిక్కినట్లే. ఈ న

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో నిర్ణాయక సమయం వచ్చేసింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరివైపుంటే వారికే ప్రభుత్వాధికారం దక్కే వీలు తథ్యమని తేలుతుండటంతో  మిగతా అంశాలు పక్కన బెట్టి ఎమ్మెల్యేలు ఎవరివైపు ఎవరున్నారని తేలడమే తరువాయి ప్రభుత్వంపై పట్టు చిక్కినట్లే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే నేరుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించేసింది. దీనికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆమోదముద్ర వేయడమే తరువాయి. దీంతో తమిళ రాజకీయ సంక్షోభ పరిష్కారానికి స్పష్టత వచ్చేసినట్లే అని భావిస్తున్నారు. 
 
అసెంబ్లీలో పన్నీర్ సెల్వంకు బలం నిరూపించుకునే అవకాశం ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సుబ్బలక్ష్మి జగదీశన్‌ తెలిపారు. దీంతో తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రతిపక్ష డీఎంకే ఆపన్నహస్తం అదిస్తుందా లేదా అనే చిక్కుముడి వీడిపోయింది. పైగా ఎమ్మెల్యేలను నిర్బంధించడం సరికాదని, ఎవరి మద్దతు ఇవ్వాలనే విషయంలో శాసనసభ్యులకు స్వేచ్ఛ ఇవ్వాలని  డీఎంకే ఎంపీ కనిమొళి అభిప్రాయపడ్డారు. అయితే అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోమని ఆమె స్పష్టం చేశారు. కొనసాగుతున్న పరిణామాలు తుది దశకు చేరుకుని ఒకవేళ పన్నీరు సెల్వం బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే డీఎంకే ఆయనకు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు మద్దతుగా స్టాలిన్ మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. శశికళపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పన్నీర్ చర్యలను ఆయన సమర్థిస్తున్నారు. అయితే తామేప్పుడూ పన్నీర్ సెల్వంను సమర్థించలేదని, అంశలవారీ మద్దతు మాత్రమే ఇచ్చామని స్టాలిన్ చెప్పడంతో డీఎంకే వైఖరి స్పష్టమైందన్న వాదనలు విన్పిస్తున్నాయి. త్వరలో శుభవార్త చెబుతానని గవర్నర్ ను కలిసిన తర్వాత సెల్వం అనడంతో బలనిరూపణకు ఆయనకు అవకాశం ఉంటుదని వార్తలు వస్తున్నాయి.
 
గురువారం మొత్తంమీద పన్నీర్ సెల్వం గ్రూప్‌కు అన్నీ శుభవార్తలే. గురువారం సాయంత్రం చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వం, శశికళలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లే ఇచ్చి శశికళ ఆస్తుల దస్త్రం పరిశీలనుకు పూనుకోవడంతో గవర్నర్ మనసులో, కేంద్రం మనసులో ఏముందనేది తేలిపోయింది. నిర్బంధించిన ఎమ్మెల్యేల అండతో ఎంత త్వరగా  వీలయితే అంత త్వరగా ముఖ్యమంత్రి గద్దె చేజిక్కించుకోవాలనుకున్న శశికళ ప్లాన్‌లు మొత్తంగా చెదిరిపోయాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో కూడా ఆమె అర్హతపై పిటిషన్ విచారణకు వస్తుండటంతో శశి బృందంలో ఆందోళన పెరుగుతున్నట్లు సమాచారం.