శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (09:05 IST)

రఘురాం రాజన్ గొప్ప దేశ భక్తుడు... దేశం కోసమే పనిచేస్తారు : నరేంద్ర మోడీ

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేస్తూ వచ్చిన తీవ్రమైన ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోసిపుచ్చారు.

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేస్తూ వచ్చిన తీవ్రమైన ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోసిపుచ్చారు. రఘురాం రాజన్ గొప్ప దేశ భక్తుడనీ, దేశాన్ని ప్రేమిస్తూ.. దేశం కోసమే పని చేస్తారని కితాబిచ్చారు.
 
ఇటీవల స్వామి మాట్లాడుతూ 'రాజన్‌ మానసికంగా భారతీయుడు కాదు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. అయినప్పటికీ.. స్వామి వ్యాఖ్యలను ప్రధాని ఏ సందర్భంలోనూ ఖండించనూ లేదూ.. సమర్థించనూ లేదు. 
 
ఈ నేపథ్యంలో మోడీ ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ రాజన్‌ దేశభక్తిని శంకించాల్సిన పని లేదన్నారు. అదేసమయంలో, తననుతాను వ్యవస్థ కన్నా ఎక్కువగా ఎవరైనా భావిస్తే అది తప్పు అని పరోక్షంగా సుబ్రమణ్య స్వామికి చురకలు వేశారు. 
 
'మా పార్టీలో వ్యక్తులు చేసినా బయటివారు చేసినా, అలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితం. ప్రచారంపై ఈ తరహా మక్కువ దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు (స్వామి?) బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎవరైనాగానీ తమనుతాము వ్యవస్థకన్నా ఎక్కువగా భావిస్తే అది తప్పు' అని ప్రధాని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, రాజన్ గురించి ప్రస్తావిస్తూ.. 'ఆయనతో నా అనుభవం చాలా చక్కటిది. ఆయన చేసిన కృషిని నేను ప్రశంసిస్తాను. ఎవరి దేశభక్తి కన్నా ఆయన దేశభక్తి తక్కువ కాదు. ఆయన భారతదేశాన్ని ప్రేమిస్తారు. ఆయనో దేశభక్తుడు' అని వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో నియమితులైనప్పటికీ రాజన్‌ తన పదవీకాలంలో పూర్తిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 
 
అలాగే, మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు.. రాజన్‌ను కొనసాగిస్తారా లేదా అంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. నేను రాజన్‌ను కొనసాగించనని వారు చెప్పారు. కానీ, అది తప్పని రుజువైంది. ఆయన భారత ప్రయోజనాల కోసం పనిచేయరనడం అన్యాయం. రాజన్‌ ఎక్కడ పనిచేసినా.. ఏ పదవిలో ఉన్నా భారతదేశానికి తన సేవ కొనసాగిస్తారని చెప్పారు.